TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఆరు పురాతన ఆలయాలు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయాల ట్రస్ట్‌గా గుర్తింపు పొందిన టీటీడీ తన శ్రీవాణి ట్రస్టుకు వందల కోట్ల రూపాయల విరాళాలు అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆలయాల నిర్మాణాలను చేపట్టేందుకు భక్తుల నుంచి విరాళాలు సేకరించడంతోపాటు పురాతన ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ "శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం" (శ్రీవాణి) ట్రస్టును కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించింది.


ఆరు ఆలయాల పునరుద్ధరణకు 11.16 కోట్లు


అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.2.65 కోట్లు, వైఎస్ఆర్ జిల్లా రంగసముద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి రూ.1.5 కోట్లు, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం రూ.1.85 కోట్లు, నంద్యాల జిల్లా సంజామల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం రూ.2.21 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.2.4 కోట్లు, శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయం రూ. కాకినాడ పట్టణానికి కోటి రూపాయలను నిధులను కేటాయించింది. 


శ్రీవాణి విరాళాలపై ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ 


శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి మే నెల వరకు 861 కోట్లను భక్తులు విరాళాలుగా సమర్పించగా, 602 కోట్ల 60 లక్షలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్లు ఆలయ ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. కరెంటు అకౌంట్‌లో 139 కోట్ల నిధులు ఉన్నాయని, 120.24 కోట్లని వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేయగా, శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్లు ద్వారా 36.50 కోట్ల రూపాయల వడ్డీ వచ్చిందని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. 2019 సెప్టెంబర్ 23వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ కీ విరాళాలు సమర్పించిన భక్తులకీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, శ్రీవాణి ట్రస్టుకీ రూ 500, 300లకు భక్తులకీ రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని వెల్లడించారు. అలాగే శ్రీవాణి ట్రస్టుకీ విరాళాలు ఇచ్చిన భక్తులకి రాజ్య మార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.


శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ప్రారంభించిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి, మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాలన చేపట్టామన్నారు. ఇప్పటి  వరకు 70 మంది దళారులను అరెస్ట్ చేసి, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 8 లక్షల మందికీపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా ఎవరూ ఆరోపణలు చేయలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళ్తే.. రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి తాము రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మండిపడ్డారు.