Vaikunta Dwara Darshan Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.


డిసెంబ‌రు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. భ‌క్తులు తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నంలో ఆరోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. డిసెంబ‌రు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుప‌తిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ కోరింది.


కార్యక్రమాల వివరాలు
డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి నాడు ఉదయం 9 నుండి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాలతో సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.


డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాదశిని పుర‌స్క‌రించుకుని తెల్ల‌వారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ సుద‌ర్శ‌న చక్రత్తాళ్వార్ల చ‌క్ర‌స్నాన మ‌హోత్స‌వం వైభ‌వంగా జ‌రగ‌నుంది. ఈరోజును స్వామి పుష్క‌రిణి తీర్థ ముక్కోటి అని కూడా పిలుస్తారు.


ఆర్జిత సేవ‌లు ర‌ద్దు
ఈ ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో డిసెంబ‌రు 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ ప‌ది రోజుల పాటు ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.


గ‌తంలో తరహాలోనే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీల‌కు, కుటుంబ సభ్యులకు ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఇస్తారని టీటీడీ వెల్లడించింది. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బోరని టీటీడీ స్పష్టం చేసింది.