TTD News: ఏడు కొండపై ఉన్న వసతి కొరత సమస్యని తీర్చేందుకు టీటీడి ప్రయోగాత్మకంగా మొబైల్ కంటైనర్స్ ని భక్తులకి అందుబాటులోకి తెచ్చింది. దాదాపు తొమ్మిది లక్షల రూపాయలతో ఈ  మొబైల్ కంటైనర్ ను తయారు చేసారు. త్వరలోనే భక్తులకు అందుబాటులో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. మొబైల్ కంటైనర్ పేరుతో రూపొందిన ఈ రూంలో ఆత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేశారు. అసలు ఈ మూవింగ్ రూంను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనుందంటే..


కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా వసతి గదుల కోసమే చూస్తుంటారు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ప్రతి రోజు లక్షలాది మంది తిరుమలకు వస్తారు. అయితే భక్తులందరికి ఏడు కొండలపై వసతి సదుపాయం ఏర్పాటు చేసే సౌకర్యం చాలా తక్కువ. ప్రస్తుతం తిరుమలలో 30 వేల నుంచి 40 వేల మంది భక్తులకు మాత్రమే వసతి సదుపాయం లభిస్తుంది. ఈ తరుణంలో వసతి గదులు దొరకని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. అలాగే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వసతి దొరక్క భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న టీటీడీ ఈ వినూత్న ఆలోచన చేసింది. అతి తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది భక్తులు బస చేసే విధంగా మొబైల్ కంటైనర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగం డిపోలో ఏర్పాటు చేసిన మొబైల్ కంటైనర్ ని టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డీఐ జానకిరామిరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 


మూవింగ్ మొబైల్ కంటైనర్స్ ధర ఎంతంటే?


ఈ మొబైల్ కంటైనర్లను విశాఖ ట్రేడ్స్ సంస్థ అధినేత మూర్తి టీటీడీకి అందించారు. ఇందులో భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉంటాయి. ఈ మూడు కంటైనర్ల విలువ దాదాపు రూ.25 లక్షలు అని అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా రాబోయే రోజుల్లో వీటిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిని మొదట టీటీడీ ఉద్యోగులు ప్రయోగాత్మకంగా వినియోగించి తర్వాత భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో టీటీడీ ఉంది. 


కొత్త విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్


తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు భాస్కర్ రావు విరాళంతో ఈ విశ్రాంత గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోను దాత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్, వీజీవోలు జాలిరెడ్డి, గిరిధర్ రావు పాల్గొన్నారు.