Tirumala Sri vani Tickets :  తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి టిటీడీ కొత్త సూచనలు చేసింది. శ్రీవాణి దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసి వెళ్లేవారిని ఇక నుంచి తగ్గించాలని నిర్ణయించారు.  జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్ లైన్ లో 500 టికెట్లు జారీ చేస్తారు.  తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసినట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.  ఇందులో భాగంగా ఇదివరకు ఉన్నట్లే ఆన్ లైన్ లో 500, ఆఫ్ లైన్ లో 1,000 టికెట్లను జారీ చేస్తారు.   తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.   శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో 100 టికెట్లు అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. 


వీఐపీ బ్రేక్ దర్శనం  కోసం టీటీడీ శ్రీవాణి పేరుతో దర్శన టిక్కెట్ల అమ్మకాన్ని ఐదేళ్ల కిందట ప్రారంభించింది.  ఈ దర్శనం టిక్కెట్ పొందాలనుకునే భక్తులు రూ. 10,000 విరాళం సమర్పించాల్సి ఉంటుంది. ఈ దర్శనం చేసుకునే భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేదు. అంతేకాదు స్వామివారిని అతి దగ్గరగా దర్శించకునే  వీలుకల్పిస్తుంది టీటీడీ.   శ్రీవాణి ట్రస్ట్ భారతదేశం అంతటా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం, నిర్వహించడం..  ఆచారాలు, విధులు, పండుగలను నిర్వహించడానికి సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని 2018లో ప్రారంభించారు. ఈ ట్రస్ట్ కు నిధల కోసం ..  వీఐపీ దర్శన టిక్కెట్లను అమ్మాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ ధర రూ. ఐదు వందలు.. టీటీడీకి.. మిగిలిన పది వేల శ్రీవాణి ట్రస్ట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ నిధులతో చాలా ఆలయాలు నిర్మించామని టీటీడీ ప్రకటించింది. 


శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఎన్నారైలు ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ముందుగానే టిక్కెట్లు కోటా కింద భక్తులకు టీటీడీ కేటాయిస్తుంది. వారికి దర్శన అవకాశాలు లభించడం దుర్లభంగా మారుతుంది. అందుకే .. ఎయిర్ పోర్టులోనూ ఈ శ్రీవాణి టిక్కెట్లను అందుబాటులో ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్కువగా ఇలాంటి టిక్కెట్లు అమ్మడం వల్ల దేవుడ్ని సామాన్య భక్తుడికి దూరం చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం.. ఈ దర్శన టిక్కెట్లను పరిమితం చేయాలని నిర్ణయించారు. గతంలో పరిమితి లేకుండా ఎంత మంి వచ్చి విరాళం ఇస్తే అంత మందికి జారీ చేసేవారు.