తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వన్యమృగాల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో సమావేశం అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో చిన్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతించేలా చర్యలు చేపట్టింది.  


మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని పేర్కొంది. నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ప్రయోగాత్మకంగా ఊతకర్రలు ఇచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం తిరుమలకు భక్తులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు అకస్మాత్తుగా జంతువులు కనిపిస్తే వాటి నుంచి రక్షణ పొందేందుకు ఈ ఊత కర్ర ఇస్తున్నారు. ప్రతి భక్తుని చేతిలో కర్రను ఇచ్చి జాగ్రత్తలు చెప్తున్నారు. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తుల భధ్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించింది. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకుంది.