High Cout sentenced TTD EO Dharma Reddy for Imprisonment
అమరావతి: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భారీ షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను ధర్మారెడ్డి అమలు చేయలేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై తాక్కాలిక ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.  హైకోర్టు ధర్మారెడ్డికి జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మారో వారం అదనపు జైలు శిక్ష పొడిగించాలని ఆదేశించింది. తమ తీర్పును అమలు చేయకపోవడంపై సైతం టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఒకరోజు సమయం
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సోమవారం అంటే డిసెంబర్ 12వ తేదీ 2022 రోజున 65 వేల 466 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26 వేల 174 మంది తలనీలాలు సమర్పించగా.. 3.28 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 4 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 


ఆన్ లైన్‌లో తిరుపతి లడ్డూలు బుక్ చేసుకుంటున్నారా, ఇది తెలుసుకోండి
తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజ్‌ను కొందరు క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు, టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తిరుపతి లడ్డూను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చునని ప్రచారం మొదలుపెట్టారు కేటుగాళ్లు. ఇది నిజమే అనుకుని భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తుండగా గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించారు. ఆన్ లైన్‌లో తిరుపతి లడ్డూలు బుక్ చేసుకోవచ్చననే ప్రచారంలో నిజం లేదన్నారు. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.