Tirumala News: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ వేళ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణలు చెప్పే ముందు హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసరంగా సమావేశమైన టీటీడీ బోర్డు జరిగిన దుర్ఘటనపై రివ్యూ చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణ చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారా అంటూ మాట్లాడారు.
మీడియా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆయన దాన్ని చాలా లైట్ తీసుకొని జరిగిన దుర్ఘటన బాధాకరం అంటూనే క్షమాపణలు చెబితే చనిపోయిన వాళ్లు బతుకుతారా అంటు మాట్లాడారు. ఇది వైరల్ అయింది. డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తిని అలా మాట్లాడటం ఏంటని కూటమి నేతల్లో చర్చ నడిచింది. ఆయన మాట్లాడిన పది నిమిషాల్లోనే ఆ మాటలు వైరల్‌గా మారాయి.
దీనిపై ప్రభుత్వ పెద్దలు కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్న బీఆర్ నాయుడు అరగంటలోనే మరో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఆయనను తను ఎలాంటి కామెంట్స్ చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్ గురించి చెప్పారేమో అన్న ఆలోచనతో వచ్చే ప్రతి కామెంట్‌ను పట్టించుకోలేదని చెప్పానన్నారు.
జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమన్న బీఆర్ నాయుడు భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలో ఎవరు ఉన్నా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు. పొరపాట్లు జరిగాయని గుర్తించామని అవి భవిష్యత్‌లో రిపీట్ కాకుండా చూససుకుంటామని అన్నారు. ప్రస్తుతానికి పది రోజులు దర్శనాలు కొనసాగిస్తామని పాత విధానంలోనే అన్నీ జరుగుతాయని అన్నారు.
తిరుమలలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశిస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ఆ విచారణ పూర్తి అయిన తర్వాత కచ్చితంగా బాధ్యులు ఎవరైనా తేలితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టు మృతులకు డబ్బులు పంపిణీ చేస్తామని అన్నారు. వాళ్లకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. శనివారం ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందజేస్తామని అన్నారు.