TTD VIP Break Darshan Tickets: తిరుమల (Tirumala) వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో ఏడుకొండలపై ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. స్వామివారి దర్శనానికే కాదు... దర్శనం టికెట్ల కోసం కూడా పెద్దపెద్ద క్యూలైన్లు ఉంటాయి. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మరో ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనం (VIP Break Darshan) టికెట్ల తీసుకునే వారు.. క్యూలైన్ల నిలబడి కష్టపడకుండా... కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు కొనుగోలు చేసేలా... చర్యలు చేపడుతోంది తిరుపతి తిరుమల దేవస్థానం. క్యూలైన్‌లో భక్తులు నిలబడకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది టీటీడీ. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకోనుంది. 


ఇప్పటి వరకు చూస్తే MBC (ఎంబీసీ) 34లోని కౌంటర్‌ దగ్గర వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల  మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ పంపుతున్నారు. భక్తులు ఆ లింకుపై క్లిక్‌ చేస్తే పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లోనే నగదు చెల్లించిన తర్వాత టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.  రెండు రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది టీటీడీ. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ కొత్త విధానాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేయబోతోంది. దీని వల్ల చాలా మంది భక్తులకు  క్యూలైన్ల నిలబడకుండా ఉపసమనం కలగనుంది.


ఇక... తిరుమలలో నిర్వహించిన మూడు రోజుల ధార్మిక సదస్సులో పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని 108 తీర్థాలను భక్తులు సందర్శించేలా ఏర్పాటు చేస్తామమన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తామని... బడుగు బలహీన వర్గాల కోసం నూతన ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా... మతాంతీకరణలను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.  తిరుమలలో మాదిరిగానే తిరుపతిలో కూడా సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తి భావనను కలిగించేలా చర్యలు చేపడతామని చెప్పారు భూమన కరుణాకర్‌రెడ్డి.


మరోవైపు... రథసప్తమి వేడుకల సందర్భంగా... ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో (TTD EO) ధర్మారెడ్డి ప్రకటించారు.. రథ సప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేశారు. అంతేకాదు.. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం కూడా రథసప్తమి రోజు ఉండదని స్పష్టం చేశారు. ఆ రోజు ఆర్జిత సేవలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.