Sree Vidyanikethan Engineering College:
తిరుపతి: యువతరం సూర్యుడితో పాటు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యానికేతన్ పరిసరాల్లో ఉన్న సాయిబాబ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్యాంపస్ మొత్తాన్ని పరిశీలించిన వెంకయ్యనాయుడు అక్కడి సౌకర్యాలను, అతిపెద్ద వంటగదిని, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించారు. క్యాంపస్ లో పచ్చదనంతో పాటు, సౌకర్యాలకు పెద్దపీట వేసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ పచ్చదనాన్ని కాపాడుకుంటున్న కళాశాల నిర్వహణ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
దేశభక్తి అంటే దేశాన్ని గౌరవించటం మాత్రమే కాదన్న వెంకయ్యనాయుడు, దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేశారు. సాటి మనిషిని గౌరవించటం, ప్రకృతిని కాపాడుకోవటం, మన బాధ్యతలను మనం నిర్వర్తించటంలోనే నిజమైన దేశభక్తి దాగి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈతరం యువత భాష సంస్కృతులకు దూరమౌతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, పెద్దలను గౌరవించటం, మన సంస్కృతిని అలవరుచుకోవటం, భాషను కాపాడుకోవటం జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవటం, వ్యాయామం, చదవటం, సంగీతాన్ని ఆస్వాదించటం, పచనమైన ఆహారాన్ని భుజించటం వంటివి చక్కని శారీరక ఆరోగ్యాన్నే గాక, మానసిక అరోగ్యాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో సాంకేతికంగా దేశం సాధిస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఆనందంగా ఉందన్న వెంకయ్యనాయుడు, అదే సమయంలో సాంకేతికతను యువత సరైన విధంగా వాడుకోకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక అభివృద్ధి మంచిదే అని అదే సమయంలో మన సృజనాత్మకత, జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం జరగాలని, అన్నింటికీ సాంకేతికత మీద ఆధారపడి మెదడును మొద్దు బారేలా చేసుకోవటం మంచిది కాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్ళాలన్న యువత ఆకాంక్షలను సమర్థించిన ఆయన వెళ్ళండి - నేర్చుకోండి - సంపాదించండి - తిరిగి మీ దేశాభివృద్ధి కోసం పాటు పడండి (గో.. లెర్న్.. ఎర్న్... రిటర్న్...) అని ఉద్బోధించారు. జీవితంలో ప్రతి మనిషి కన్న తల్లిదండ్రులను, పుట్టిన ప్రదేశాన్ని, జన్మనిచ్చిన దేశాన్ని, మాతృభాషను, చదువు చెప్పిన గురువును మరువు కూడదని పేర్కొన్నారు. మాతృభాష ఔన్నత్యాన్ని వివరించిన ఆయన, ముందు మాతృభాషను నేర్చుకోవాలని, ఆ తర్వాత సోదర భాషలను, అనంతరం ఇతర భాషలను నేర్చుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
మన చదువు డిగ్రీల కోసం మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని నిత్యం అభివృద్ధి చేసుకోవాలని యువతకు సూచించారు వెంకయ్యనాయుడు. భారతదేశ జనాభాలో సగానికి పైగా యువతరమే ఉందని, భారత దేశ అభివృద్ధిలో యువజనశక్తి భాగస్వామ్యం కావాలన్నారు. కష్టపడే భారతీయ యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని, వారు రావాలనుకుంటే రాజకీయాల్లోకి కూడా రావచ్చన్నారు. రాజకీయాల్లో విలువలు పెంచే బాధ్యత యువత మీదే ఉందన్న ఆయన, ఈ దిశగా యువతరం పూనుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి సూచీలో భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుందో, సంతోషకరమైన జీవన విధానం సూచీలో కూడా అదే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షించిన ఆయన, ఈ రెండిటినీ యువతరమే సాధించగలదని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబు, సి.ఈ.ఓ. మంచు విష్ణు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వినయ్ మహేశ్వరి, యూనివర్సిటీ ఉపకులపతి డా. నాగరాజ రామారావు, జె.ఎన్.టి.యూ అనంతపురం సంచాలకు డా. బి.ఈశ్వర్ రెడ్డి, రిజిస్ట్రార్ కె.సారధి, ప్రిన్సిపల్ డా. బి.ఎమ్. సతీష్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు వెంకయ్యనాయుడు బంగారు పతకాలను ప్రదానం చేశారు.