తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. పరిణయోత్సవంలో రెండవ రోజైన ఆదివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ తిరుచ్చి లలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు.
మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, సౌరాష్ట్ర రాగం, దేసిక, మలహరి, యమునా కళ్యాణి, ఆనంద భైరవి నీలాంబరి రాగాలు, వివిధ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. తరువాత
అన్నమాచార్య సంకీర్తనలతో ప్రాంగణం అంతా మారుమోగింది. ప్రముఖ హరికథా భాగవతార్ శ్రీ వేంకటేశ్వరులు పద్మావతి శ్రీనివాస పరిణయంపై హరికథా పారాయణం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది.
అష్టలక్ష్మీ, దశావతార మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు..
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ, దశావతార మండపంలో శనివారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారం శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు.. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మీ మండపం :
శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్, ఫైనాపిల్, మొక్కజొన్న కంకులు, ఆస్ట్రేలియా ఆరంజ్, నారింజ, ద్రాక్ష, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, కార్నస్ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 3 టన్నుల ఫలాలు, 1.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్లు ఉపయోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్ బాల్స్, షాండ్లియర్లు వేలాడదీశారు. చిన్ని కృష్ణుడు, వెన్న కుండలు, ఎనుగులు, నెమళ్ళు సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ మండప అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్టు 24 లక్షలు టీటీడీకి విరాళం అందించింది. 15 రోజులుగా 30 మంది చెన్నైకి చెందిన నిపుణులు, రెండు రోజులుగా 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ప్రాంగణాన్ని అత్యంత మనోహరంగా అలంకరించారు.