Tirumala news: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ఐదేళ్ల కాలంలో టీటీడీకి ఈవో లేడు. తొలుత టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి వ్యవహరించారు. ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా బదిలీ చేసారు. ఆ తరువాత ఐఆర్ఎస్ అధికారి అయిన ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమల జేఈవోగా నియమించారు. ఈవో లేని కారణంగా తిరుమల జేఈవోకు అదనపు ఈవో బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత కొన్ని రోజులకు టీటీడీ ఈవో గా మరో అదనపు ఈవోగా కేటాయించారు.
తిరుమలకు సంబంధించి అప్పటి వరకు ఉన్న తిరుమల జేఈవో, అదనపు ఈవో రెండు పోస్టులతో పాటు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఇచ్చారు. ఇక టీటీడీ తిరుపతి పరిపాలన కు సంబంధించి అప్పటి వరకు ఒక జేఈవో పదవి మాత్రమే ఉండేది.. అది రెండు గా మార్చారు. ఇందులో విద్య, వైద్యం కింద ఓ జేఈవో పోస్టును కేటాయించి మిగిలిన పరిపాలన మొత్తం మరొక్క జేఈవోకు ఇచ్చారు. అప్పట్లో ఈ పోస్టులకు సంబంధించి కొందరు వ్యతిరేకించారు. మరికొందరు నాయకులు భాజపా కి చెందిన భాను ప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి సైతం ఐఆర్ఎస్ కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వడం పై కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం పలు అంశాలను ఉపయోగించి ఈవో కాదు అదనపు ఈవో అని చూపిస్తూ ధర్మారెడ్డిని ఐదేళ్ల పాటు టీటీడీలో కొనసాగించారు.
టీటీడీ పాలకమండలి ఏర్పాటు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడుసార్లు టీటీడీ బోర్డులు చేశారు. ఇందులో రెండు పర్యాయాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గా జగన్ కు బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అప్పట్లో ప్రత్యేక ఆహ్వానితులు అంటూ ఓ 100 మంది పేర్లు పెట్టి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే రెండో పాలకమండలిలో ఈ విషయం పై కోర్టు ను భానుప్రకాష్ రెడ్డి కోర్టులో మెట్టు ఎక్కారు. దీనిపై జెంబో బోర్డు ను కోర్టు రద్దు చేసింది. అయితే అందులోని పలువురు ప్రముఖులకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ స్థానిక మండలి అధ్యక్షులుగా ఎంపిక చేసారు. ఆ తరువాత మూడో పాలకమండలికి టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కి కేటాయించారు. ఆ బోర్డు సమయం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలో మరో టీటీడీ బోర్డు వేయకపోగా టీటీడీ చైర్మన్ పదవిని, ఎక్స్ అఫీసిషియో సభ్యులను మాత్రం కొనసాగారు.
కూటమి ప్రభుత్వం చర్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ కు రూ.10వేలు చెల్లిస్తే ఒక వ్యక్తి కి బ్రేక్ దర్శనం కేటాయించేలా, ఆ నిధులను పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల నిర్మాణం, దూప దీప నైవేద్యాలు సమర్పించేలా తీర్మానం చేశారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ ప్రారంభించిన నాలుగేళ్ల లో సుమారు 100 కోట్ల మార్క్ దాటింది. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులు ప్రభుత్వ ఖజానాకు మార్చారని, ట్రస్ట్ పేరుతో అవసరం లేని ప్రాంతాల్లో, బాగున్న ప్రాంతాల్లో నిర్మాణాలు చేసి టీటీడీ నిధులను అక్రమంగా వైసీపీ తినేస్తుందని, నిర్మాణ కాంట్రాక్టులు వైసీపీ నాయకులు వారి అనుచరులకు అప్పగించారని దీని ద్వారా భారీ మొత్తంలో కమీషన్లు చేతులు మారాయని కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది.
టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాలకమండలి సమావేశాలు నిర్వహించి టీటీడీలో ఎప్పుడు జరగని విధంగా కాంట్రాక్టు పనులకు ఆమోదం తెలపడంతో పాటు రివర్స్ టెండరింగ్ విధంగా ద్వారా ఈ సుమారు 1500 కోట్ల వర్కులకు ఆమోదం తెలపడంతో కూటమి వాటిపై ఆరోపణలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వచ్చి ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని ప్రకటించడం ఆ మరుసటి రోజే టీటీడీ ఈవో నియామకం.. ఆ తర్వాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించి వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించడం వెంట వెంట వెంటనే జరిగిపోయాయి.
ఇంజినీరింగ్ విభాగంపై ఫోకస్
టీటీడీ లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిందని 55 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటులు సైతం జారీ చేసి వారి పనితీరు.. ఎవరు చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎక్కడ చేశారనే అంశాలపై వివరాలు సైతం నమోదు చేశారు. షోకాస్ నోటీసులు రావడంతో టీటీడీ ఇంజనీరింగ్ ఉద్యోగులు తమకేం సంబంధం లేదు.. టిటిడి బోర్డు నిర్ణయం మేరకు టిటిడి ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్ చెప్పడంతోనే తమ పనులు చేసామని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆరు మందిని నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఛైర్మెన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సీఈ నాగేశ్వరరావు, ఎఫ్ అండ్ సీఈవో ఓ.బాలాజీ ను ప్రధానంగా కేసులో ఉచ్చు బిగిస్తున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు ఎలా ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. తిరుపతి లోని రెండు గోవింద రాజ స్వామి వారి సూత్రాలు కూల్చి అక్కడ 300 కోట్లతో అచ్చుతం, 300 కోట్లతో శ్రీపాదం కి నిధులు మంజూరు చేయడం ఇలా పలు అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర విజిలెన్స్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.