శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
హంస వాహనం - బ్రహ్మపద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీవారి కైంకర్యంలో సుగంధద్రవ్యాలు, ఎండుఫలాలు
శ్రీవారి స్నపన తిరుమంజనంలో శ్రీమలయప్పస్వామివారిని స్పృశించే అవకాశం చందనం, పిస్తా - ఏలకులు మాలలకు దక్కింది. మంగళవారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు.. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.
అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జియ్యంగార్లు పఠించారు.
ఈ వేడుకలో ఏలకులు, వట్టి వేరు, పిస్తా, చందనం, నల్ల ద్రాక్ష, పసుపు కొమ్ములు, రోజ్ పెటల్స్. తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.. టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపూర్, సేలం దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆలయ తిరువీధుల్లో భక్తులకు శ్రీవారు కనువిందు చేశారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మలయప్ప స్వామిని భక్తులు దర్శిచుకున్నారు. ఇక పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.