Vaikunta Dwara Darshanam Tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గొని భక్తులు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. నవంబరు నెలలో 19.73 లక్షల మంది స్వామి వారి దర్శించుకోవడం జరిగిందని, రూ.108.46 కోట్ల హుండీ ద్వారా భక్తులు స్వామి వారిని కానుకలు సమర్పించడం జరిగిందన్నారు. 97.47 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించడం జరిగిందని, 36.50 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించగా, 7.06 లక్షల మంది భక్తులు స్వామి వారి తలనీలాలు సమర్పించడం జరిగిందన్నారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నాంమని, 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశామన్నారు‌‌..


రోజుకు 2000 టికెట్లు చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను కూడా నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేశాంమని, తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా డిసెంబరు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.


దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని ఈవో వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టీటీడీ సహకరించాలని కోరారు. డిసెంబరు 22 నుండి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసాంమని, ఈ సేవలను డిసెంబరు 25 నుండి 30వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు సహస్రదీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తాంమని, వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని, వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాంమన్నారు. నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం ఉంటుందని, అదేరోజు గీతాజయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండపారాయణం నిర్వహిస్తాంమన్నారు‌‌. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల ధ్యానారామంలో నవంబరు 14న ప్రారంభమైన రుద్రాభిషేకం డిసెంబరు 12వ తేదీ వరకు జరుగుతుందన్నారు..


ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కావడంతో ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం జరుగుతుందని, తిరుమలలో గదులు పొందిన భక్తులు కాషన్‌ డిపాజిట్‌ ప్రస్తుత స్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ట్రాకర్‌ను పొందుపరిచాంమని, భక్తులు గది బుక్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అకామడేషన్ - బుకింగ్‌ హిస్టరీ - ఆఫ్‌లైన్‌ అకామడేషన్‌ సిడి రీఫండ్‌ ట్రాకర్‌ను క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు..