TTD Income Latest: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఈసారి 2023-24 ఏడాదిలో వచ్చిన ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. 2023-24 ఏడాదికి గాను రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు తెలిసింది. తాజాగా టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేసింది. గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చిందని దేవస్థాన అధికారులు తెలిపారు.  తాజాగా రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేయడంతో మొత్తంగా రూ.18 వేల కోట్లకు దేవస్థాన డిపాజిట్లు చేరుకున్నాయని అన్నారు. దీంతో, ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటింది. కాగా, 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా రూ.500 కోట్లు ఎక్కువకు చేరుకుంది.


ఇక తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఫ్రీ దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో నిండి ఉన్నారు. శనివారం ఏప్రిల్ 20న భక్తులు 73,051 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లుగా ఉందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.


నేటి నుంచి వసంతోత్సవాలు 
తిరుమలలో నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. నేడు ఏప్రిల్ 21న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. రేపు స్వర్ణరథంపై మాడ వీధులలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ఊరేగనున్నారు. దీంతో మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.