ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు ఏపీ ప్రభుత్వం పాలకమండలిని నియమిస్తూ ఉంటుంది. టీటీడీ పాలక మండలిలో ఛైర్మన్ పదవి నుండి పాలక మండలి సభ్యులుగా బాధ్యత నిర్వర్తించేందుకు రాజకీయ నాయకుల నుండి, బడా పారిశ్రామిక వేత్తల వరకూ భారీగా పోటీ పడుతుంటారు. ఇందుకోసం కేంద్ర రాజకీయ ప్రముఖుల వద్ద నుండి సైతం సిఫార్సులు చేయిస్తూ ఉంటారు. వైకుంఠ వాసుడి సేవ చేసే భాగ్యం దక్కితే చాలు ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది శ్రీ వేంటేశ్వరుడిని అతి దగ్గరగా సేవ చేసే భాగ్యంతో పాటుగా, అతి సమీపంగా స్వామి వారి చూసి తరించే భాగ్యం లభించడమంటే వారి జన్మ సార్ధకం అయినట్లే. అందుకే టీటీడీ పాలక మండలి పదవులకు దేశంలో ఏ పదవీకి లేనంత డిమాండ్ ఉంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
వైసీపీ వచ్చాక మారిన సాంప్రదాయం
టీటీడీలోని నిర్వహణ కార్యక్రమాలను టీటీడీ పాలకమండలే స్వయంగా చూస్తూ ఉంటుంది. అయితే గతంలో 18 మంది సభ్యులతో కూడిన పాలకమండలి నియామకం జరిగేది. 2019లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా, కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 35 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేయడంతో పాటుగా, పలు రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ స్ధానిక సంస్ధల ఛైర్మన్ లను సైతం టీటీడీ పాలక మండలి సభ్యుల తరహాలోనే వ్యవహరించే విధంగా నిర్ణయం తీసుకుంది. గతంలో అధిక ప్రాధాన్యం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికే ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఇక బయట రాష్ట్రాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి మాత్రమే పాలక మండలిలో చోటు కల్పించేవారు.
కానీ వైసీపీ ప్రభుత్వం ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా బయట రాష్ట్రాల వారికే అధిక మందికి పాలక మండలిలో స్ధానం కల్పించింది. దీంతో పాలక మండలి నియామకంపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు, శ్రీవారి భక్తులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. కానీ అవేవీ లెక్కలోకి తీసుకోకుండా ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 35 మందితో పాలక మండలి కమిటీని కొనసాగించింది. వైసీపీ ప్రభుత్వం పాలక మండలి నియమించి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో పాటుగా ఈ ఏడాది ఆగస్టు 12వ తారీఖుకి పాలక మండలి గడువు ముగియనుంది. 2021 ఆగస్టు 12వ తారీఖున టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, టీటీడీ పాలక మండలి సభ్యులను మాత్రం సెప్టెంబర్ చివరి వారంలో నియమించింది. చైర్మన్ గా వైవీ.సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పాలకమండలి గడువు అమలులోకి వస్తుంది. అలా ప్రస్తుత పాలకమండలి గడువు ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది.
రెండు ఆప్షన్లు
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి గత కొంత కాలంగా బిజీ బిజీగా రాజకీయాలను చక్క బెట్టడంతో పాటుగా, టీటీడీ నిర్వహణ వ్యవహారాలను సైతం చూస్తూ వస్తున్నారు. అయితే రెండు భాధ్యతలు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డిపై ప్రభుత్వం పెట్టడంతో అధిక సమయం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సందర్శిస్తూ అక్కడి పరిస్ధితులను స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో వైవీ.సుబ్బారెడ్డి అవసరం ఉన్న కారణంగా మరోసారి టీటీడీ ఛైర్మన్ గా భాధ్యతలు నిర్వహణ ఇచ్చే విషయంపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తొంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రెండు ఆప్షన్లపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందులో మొదటి ఆప్షన్ నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం గానీ, రెండోవ ఆప్షన్ మరో ఏడాది పాటు తాత్కాలికంగా టీటీడీ నిర్వహణ భాధ్యతలు చూసుకునేందుకు స్పెసిఫైడ్ అధారిటీని నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ఆప్షన్స్ లో రెండోవ ఆప్షన్ పైనే ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అధికంగానే ఆశావహులు
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి గడువు ఈ ఏడాది ఆగస్టుకి ముగియనున్న క్రమంలో ఆశావాహుల సంఖ్య అధికంగానే ఉన్నట్టు సమాచారం. పాలక మండలిలో స్ధానం దక్కించుకునేందుకు ఇప్పటికే ఆశావాహులు కేంద్రంలోని కీలకమైన నాయకులు, గవర్నర్ లు, ఇతర రాష్ట్ర సీఎంల వద్ద నుండి వద్ద ఏపీ రాష్ట్ర ప్రభుత్వంకు సిఫార్సులు సైతం పంపినట్లు తెలుస్తుంది. టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకునేందుకు సిఫార్సు లేఖలు అధికంగా వస్తుండడం ఏపీ ప్రభుత్వంకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే తంతూ కొనసాగితే ప్రస్తుతం పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో పాటుగా 50 మంది సభ్యులు ఉండగా, పాలక మండలిలో సభ్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన జంబో పాలక మండలిపై, పాలక మండలిలోకొందరు అనర్హులు ఉన్నారని బిజేపి నేతలు కోర్టుకు వెళ్ళగా, ఇప్పటికి ఆ విషయం కోర్టులోనే ఉంది.
ప్రత్యేక ఆహ్వానితులకు పాలక మండలిలో చోటు లేదంటూ కోర్టు ఆర్డినెన్స్ జారీ చేయడంతో 35 మంది పాలక మండలి సభ్యులుగా ఉండాలని కోర్టు ఆదేశం జారీ చేయడంతో ఇకపై నియమించే పాలక మండలిలో కేవలం 35 మంది సభ్యులకే చోటు కలిగించే పరిస్ధితి ఉంది. మరో వైపు ఎపిలో ఎన్నికలు దగ్గర పడే అవకాశం ఉన్న క్రమంలో ఇప్పుడు టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేస్తే, బయటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే ఏపీలోని కొందరు ముఖ్య నేతల నుండే అసంతృప్తి ఎదురు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంకు వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో పాలక మండలి నియమాకం కంటే స్పెసిఫైడ్ అథారిటిని నియమించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అయితే టీటీడీ పాలక మండలి నియమిస్తే టీటీడీ ఛైర్మన్ పదవికి జంగా కృష్ణమూర్తితో పాటుగా, చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి ఆశిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలక మండలిపై వస్తున్న ఒత్తిడులను తట్టుకుని పాలక మండలి నియమిస్తుందా. లేక స్పెసిఫైడ్ అధారిటీని నియమిస్తుందా అనే మాత్రం వేచి చూడాలి.