వైకుంఠ వాసుడైన శ్రీనివాసుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వైకుంఠ ద్వార దర్శనం గుండా శ్రీవారిని దర్శించుకునేందుకు ధనవంతుల నుండి కటిక పేద వరకూ తిరుమలకు క్యూ కడుతారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు వేకువజామున 12:05 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అయ్యింది. ముందుగా ప్రముఖులకు దర్శనం కల్పించిన టిటిడి, అటుతర్వాత ఉదయం ఆరు గంటల నుండి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తుంది. ఆదివారం రోజున 53,101 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 23,843 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 3.48 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు.
స్వర్ణ రథంపై శ్రీవారు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. ఇందులో భాగంగా వేకువజామున 12:05 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీనివాసుడి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో భక్తి శ్రద్దలతో భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి వారి దర్శన భాగ్యం పొంది పునీతులు అవుతున్నారు.. అయితే వైకుంఠ ఏకాదశు పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి స్వర్ణరధంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులను కాటాక్షించారు.
వైకుంఠ ఏకాదశి నాడు బంగారు రధంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసి భక్తులు తన్మయత్వం పొందుతూ కర్పూర నీరాజనాలు పలికారు..అంతే కాకుండా తిరుమాఢ వీధులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి.. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణరధంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శిస్తే చాలు మనోరధాలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. ధనుర్మాసం సందర్భంగా బంగారు వాకిలి వద్ద గోదాదేవి రచించిన పాసురాళ్ళు పఠించారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వైకుంఠ ద్వారం గుండా ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అర్చకులు. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.