తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఏడో రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌కు 
శ్రీ మలయప్పస్వామివారు సూర్య‌మండ‌ల మ‌ధ్య‌స్తుడై హిర‌ణ్మ‌య స్వ‌రూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. శంఖు చ‌క్రాలు, క‌త్తి, విల్లు, బాణం, వ‌ర‌ద హ‌స్తంతో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామివారు.  


సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి. చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. సూర్యప్రభ  ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభను సకల జీవుల చైతన్యప్రభగా భావిస్తారు. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు  సిద్ధిస్తాయి. అంతేకాదు.. సూర్యప్రభ వాహనం అంటే జ్ఞానమే వాహనమని అర్థం. ఇలా సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించిన స్వామిని సేవింస్తే.. జ్ఞానాన్ని పొంది భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని భక్తుల నమ్మకం. 


సూర్యుడిని పోలిన బంగారు వర్ణంలో గంభీరమైన సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్న స్వామిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనం ముందు భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. చంద్రుడుని పోలిన వెండి ప్రభ కలిగిన చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామిని తిరుమాఢ వీధుల్లో ఊరేగిస్తున్నారు. చంద్రుడు శివుని శిరస్సులో శిరోభూషణంగా ఉంటాడు. అదే విధంగా ఇక్కడ శ్రీహరికి కూడా వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కోనేటిలో కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. వారి జన్మలు చరితార్థమవుతుంది. భక్తుల కళ్లు వికసించి, భక్తుల హృదయాల నుండి అనందరసం ఉప్పొంగుతుంది. ఇలా సూర్యుడు, చంద్రుడి వాహనాల్లో ఊరేగడం ద్వారా స్వామివారు.... సూర్యచంద్రులిద్దరూ తనకు రెండు నేత్రాలవంటివారని నిరూపించారని పురాణపండితులు చెప్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రథోత్సవం జరుగుతుంది.