Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ ఏకైక అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక, కూటమిలో జోష్
Tirupati Deputy Mayor Election | రెండు రోజులపాటు జరిగిన హైడ్రామా అనంతరం తిరుపతి డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. నేడు జరిగిన ఎన్నికల్లో మునికృష్ణ విజయం సాధించారు.

Tirupati News | తీవ్ర ఉత్కంఠ మధ్య తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానాన్ని అధికార పార్టీ టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి ఇన్నాళ్లూ ఏకైక కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ మంగళవారం జరిగిన ఎన్నికల్లో నెగ్గి తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. సంఖ్యాపరంగా తిరుపతి నగర కార్పొరేషన్ లో వైసీపీకి కావాల్సినంత బలం ఉన్నా... కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 50 డివిజన్లున్న తిరుపతి కార్పొరేషన్ లో గతంలో 49 డివిజన్లకు ఎన్నికలు జరగగా... 48 వైసీపీ, టీడీపీ ఒక్క కార్పొరేటర్ గెలుచుకున్నాయి. టీడీపీ నుంచి కార్పొరేటర్ గా ఆర్సీ మునికృష్ణ ఒక్కడే ఎన్నికయ్యారు.
వైసీపీ క్రాస్ ఓటింగ్‌తో టీడీపీకే డిప్యూటీ మేయర్
అది ఒకప్పటి మాట. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత 22 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చేశారు. ఎక్స్ అఫిషీయో మెంబర్లు టీడీపీ కి మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉంటే వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి కి మద్దతుగా ఎంపీ గురుమూర్తి ఉన్నారు. దీంతో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు రాకుండా టీడీపీ నేతలు కావాలనే అడ్డుకున్నారని వైసీపీ ఆరోపించింది. మరో ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న కోరం లేదని వాయిదా పడిన ఎన్నికలు, మంగళవారం కావాల్సిన కోరం ఉండటంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది.
వైసీపీ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ తరపున మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రాధాకృష్ణ ప్రతిపాదించారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ తరపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ అన్నై అనిత ప్రతిపాదన చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు పడగా... టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 ఓట్లు వచ్చాయి. దాంతో తిరుపతిలో ఏకైక టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా విజయం సాధించడంతో కూటమిలో జోష్ నెలకొంది.
డిప్యూటీ మేయర్ ఎన్నికపై హైడ్రామా..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై మూడు రోజులుగా హై డ్రామా నడిచింది. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కూడా కిడ్నాప్ చేసి ఎన్నికలకు రాకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెరెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లకు ఓటింగ్‌కు రాకుండా కూటమి నేతలు తమ పార్టీ నేతల్ని కిడ్నాప్ చేశారని.. వాళ్ల ఇళ్లపై రాళ్ల దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణం వీడియోలు విడుదల చేయటం గమనార్హం.
144 సెక్షన్, యాక్ట్ 30 అమలు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎట్టకేలకు పూర్తి చేశారు. అందుకోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో 144 సెక్షన్ సెక్షన్ విధించి, 30 యాక్ట్ అమలు చేశామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ ఎన్నికలతో ఒక కేసు మాత్రమే నమోదు కాగా, నిన్న అనుకోని ఘటనలు జరిగాయని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
Also Read: Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు