చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సందర్భంగా అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. అందరూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని పసుపు రంగు చల్లుకొని సంబరాలు చేసుకుంటే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిద్దరాంపురం గ్రామంలో మాత్రం పొట్టేళ్లను నరికి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే పొట్టేళ్లు నైవేద్యంగా పెడతామని గ్రామ ప్రజలు మొక్కుకున్నారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు విడుదల సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున పొట్టేలను నరికి గ్రామస్తులు సంబరాలు చేస్తున్నారు. చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.
స్కార్పియోపై తారా జువ్వలు
మరోవైపు, ఇదే అనంతపురం నగరంలో చంద్రబాబు బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా టీడీపీ యువకులు స్కార్పియో వాహనంపై క్రాకర్స్ తో సంబరాలు చేసుకున్నారు. తారాజువ్వల పెట్టెను స్కార్పియో వాహనంపై ఉంచి వెలిగించి, డ్రైవ్ చేస్తూనే వాటిని పేల్చారు.
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు
ఇటు ఖమ్మం టీడీపీ ఆఫీసులో కూడా సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు ప్రయత్నం చేయాలని పిలుపు ఇచ్చారు.
చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న అభిమానం
చంద్రబాబు మంగళవారం (అక్టోబరు 31) సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగానే, ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆయన జైలు నుంచి విజయవాడ సమీపంలోని ఉండవల్లి నివాసానికి వెళ్లారు. రాజమండ్రి జైలు నుంచి బయలుదేరి రెండు గంటలైనా ఇంకా చంద్రబాబునాయుడు కాన్వాయ్ రాజమండ్రి కూడా దాటలేదు. న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి చంద్రబాబు వ్యవహరించారు. కారు లోపల నుంచే ప్రజలకు నమస్కరిస్తూ జన సందోహం మధ్యే ముందుకు చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగింది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సంయమనం పాటిస్తూ, సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు.