Chandra Babu Naidu: చంద్రబాబుకు వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ టీడీపీ శ్రేణులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమకు పార్టీకి లభించిన భారీ ఊరటగా చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 


పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... ఇక నుంచి వైసీపీ నాయకులకు ఆట మొదలైందని.. చంద్రబాబు ఒకసారి జనం మధ్యలోకి వస్తే వారి పతనం ప్రారంభమవుతుందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఇన్ని రోజులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడిన వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గత 54 రోజులగా ప్రతి ఇంట చంద్రబాబు కోసం ఆవేదన చెందినవారు ఉన్నారని.. ఆయన బయటికి రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు పండుగ చేసుకుంటున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రజల గుండెల్లో ఈ స్థాయిలో జరగని ముద్ర వేసుకోవడం చాలా అరుదు అని శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇకనుంచి మరింత ఉత్తేజంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు..


చంద్రబాబు బెయిల్ మంజూరు కావడంతో తిరుమలలో‌ మొక్కులు


తిరుమల శ్రీవారికి టిడిపి నాయకులు  మొక్కులు సమర్పించుకున్నారు.. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి, కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిందన్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీర్వాదం పొందిన నారా భువనేశ్వరి ఒక్కటే‌ కోరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని, నిజం గెలవాలని ప్రార్ధించారని తెలిపారు. భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన తరువాత శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యిందని, నారా భువనేశ్వరి సంకల్పం నెరవేరుతుందన్నారు.






పూతలపట్టు సమీపంలోని జాతీయ రహదారిపై బాణాసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. జై చంద్రబాబు జై టీడీపీ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. రాజమండ్రి, హిందూపురం ఇలా ప్రతి నియోజకవర్గంలో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. 


చంద్రబాబు నాయుడు మధ్యంతర బాయిల్  మంజూరు కావడంతో  అంబరాన్నంటిన సంబరాలు. కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి కుప్పం బస్టాండ్ సెంటర్ వద్దకు పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీ తీశారు నేతలు. బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ,ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి టీడీపీ  శ్రేణులు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టపాసులు  కాల్చుకుంటూ స్వీట్స్‌  పంచుకున్నారు. నిజం గెలిచింది ..నిజమే గెలిచింది ..  సైకో పోవాలి సైకిల్  రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. 


హైదరాబాద్‌లో సంబరాలు
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. ఇకపై టీడీపీకి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డారు.