Anantapur News: చంద్రబాబు, నారా లోకేష్ ప్రజల మధ్యకు వస్తే వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయని.. ప్రస్తుతం లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం కావడంతో వారికి భయం మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనందతర పరిణామాల తరువాత లోకేష్ సోమవారం (నవంబర్ 27) నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో పరిటాల సునీత సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. 


ముందుగా నరిగమ్మ ఆలయంలో సునీత పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు కల్గకుండా దిగ్విజయంగా ముందుగా సాగాలని ఆకాక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలసి ఆలయం నుంచి ద్వారక విల్లాస్ వరకు పాదయాత్ర చేపట్టారు. మార్గమధ్యలో ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనలకు, నారా లోకేష్ యువగళం పాదయాత్రలకు అనూహ్యమైన స్పందన రావడం చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి జైలు పంపారని అన్నారు. 


దీంతో లోకేష్ పాదయాత్ర కూడా ఆగిపోయిందని అన్నారు. కానీ చంద్రబాబు బెయిల్ పై వచ్చిన తర్వాత లోకేష్ పాదయాత్ర ప్రారంభించారని అన్నారు. 79రోజుల తరువాత లోకేష్ పాదయాత్ర చేస్తుంటే.. జనం గతం కంటే ఎక్కువగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రజల్లో టీడీపీపై ఎంత నమ్మకం ఉందో ప్రజలు అర్థం చేసుకోవచ్చని అన్నారు. రేపు చంద్రబాబు కూడా జనంలోకి వస్తారని.. ఇక ఆయన సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని పరిటాల సునీత విశ్వాసం వ్యక్తం చేశారు.