Chandrababu Visit Tirumala on 30th November: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ మొదటి వారం నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన క్రమంలో ఆయన తాత్కాలికంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవలే ఆయనకు ఈ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కంటి ఆపరేషన్ తర్వాత చంద్రబాబు, కొద్ది రోజులుగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తొలుత పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఆయన డిసెంబర్ తొలి వారం నుంచి పూర్తి స్థాయి రాజకీయాలు, పార్టీపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
30న తిరుమలకు
ఇందులో భాగంగా ఈ నెల 30న సాయంత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. అనంతరం డిసెంబర్ 1న ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి అమరావతికి వెళ్లనున్నారు. మరుసటి రోజు బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైల మల్లన్న ఆలయాలను సందర్శించనున్నారు. ప్రముఖ ఆలయాల్లో దర్శనం అనంతరం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రస్తుతం ఢిల్లీలో
చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోమవారం సాయంత్రం ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరు కానున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా, చంద్రబాబు కేసులకు సంబంధించి సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టుల్లో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
రేపు సుప్రీం ముందుకు బెయిల్ రద్దు కేసు
అటు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈ నెల 20న ఏపీ హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలో 16వ కోర్టులో ఐటెం నెం.64 కింద ఇది లిస్ట్ అయింది. కాగా, ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులు టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని హైకోర్టు ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం ఈ నెల 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply