Punganur : మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మూకల అరాచకాలు ఆగడం లేదు. టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న కాగితి రామకృష్ణనాయుడిని శనివారం దారుణంగా హత్య చేశారు. తనను చంపేస్తారంటూ పదిహేను రోజుల క్రితమే వీడియోలు పెట్టి..పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవటంతో టీడీపీ కార్యకర్త కాగితి రామకృష్ణనాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయనను వైసీపీకి చెందిన కొందరు నాయకులు వేటకొడవళ్లతో నరికి చంపారు. శనివారం ఉదయం పొలం పనుల కోసం తన కొడుకుతో కలిసి వెళ్లిన రామకృష్ణ నాయుడును దారి కాచి హత మార్చారు.ఆయన కొడుకు సురేశ్‌కుమార్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో మదన పల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పరోక్షంగా కారణమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


చంపేస్తారంటూ వీడియో విడుదల
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా..పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి హవానే నడుస్తుందన్న ప్రధాన ఆరోపణ అధికార పార్టీకి సవాల్ గా మారింది. రామకృష్ణ నాయుడుని చంపిన వ్యక్తులైన వెంకటరమణ, గణపతి, త్రిలోక్, మహేశ్ టీడీపీ గెలిచిన రోజు నుంచి రామకృష్ణ నాయుడుని ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో గెలిచినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో కేక్ కట్ చేసి సంబరాలను చేసిన తనను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని.. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పక్షం రోజు కిందర రామకృష్ణ నాయుడు  వీడియోను విడుదల చేశారు. ఈ ఉదంతం అనంతరం సీఐ.. హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. పోయిన ప్రాణం తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. 






సంబరాలు చేసుకున్నాడని కక్ష
పుంగనూరు మండలం చండ్రమాకులపల్లి పంచాయతీ కిష్ణాపురానికి చెందిన రామక్రిష్ణ నాయుడు( 55) టీడీపీలో చురుకైన కార్యకర్త. వైసీపీ ఐదేళ్ల పాలనను ఆయన ఎండగట్టేవారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో ఇంటి పట్టాలు ఇవ్వగా ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫు పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఫలితాలు వెలువడిన రోజున కేక్ కట్ చేసి.. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాడు.దీనిని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేశ్, త్రిలోక్ లు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే రామక్రిష్ణపై దాడికి దిగారు. వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రామక్రిష్ణ భార్య దేవమ్మను సైతం బైక్ తో ఢీ కొట్టారు. దీంతో ఆమె రెండు కాళ్లు దెబ్బ తిన్నాయి. తమపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇరువర్గాల పై కేసులు నమోదు చేశారు. 



స్పందించని పోలీసులు
ఊళ్లో వైసీపీ అధిక్యత ఉండాలని వార్నింగ్ ఇస్తూ ఇప్పటికే ఆయన మీద నాలుగు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కానీ తప్పించుకున్నాడు. ఐదోసారి మాత్రం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రెండు వారాల క్రితం తన పొలంలో ట్రాక్టర్ తో మట్టి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు డ్రైవర్ తో గొడవకు దిగారు.  అడ్డు వచ్చిన ఆయనను చితకబాదారు. అక్కడితో ఆగకుండా అతని కొడుకు.. కోడలి మీద దాడి చేశారు.  దీనిపై సీఐ శ్రీనివాసులకు కంప్లైంట్ చేసినా స్పందించలేదు. కొంత కాలంగా తమ మీద వైసీపీ  కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా..పోలీసులు స్పందించలేదని రామక్రిష్ణ కుటుంబీకులు వాపోయారు. సీఐ పక్షపాత వైఖరితో వైసీపీ కార్యకర్తలకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఇప్పటికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవానే నడుస్తుందని చెప్పాడు. ఆసుపత్రికి మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితరులు వచ్చి బాధితులను పరామర్శించారు.