శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ నేత గంటాపురం జగ్గును శనివారం (నవంబరు 26) అర్ధరాత్రి అరెస్టు చేయడం, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు భారీగా స్టేషన్ ఎదుట బైఠాయించి జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పరిణామాలకు తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బ్రదర్స్ కారణమని విమర్శించారు. వారు మాట్లాడిన మాటలు దిగజారుడుగా ఉన్నాయని పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హత్యారాజకీయాలంటూ మొదలుపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ నుంచే మొదలు పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత గంటాపురం జగ్గు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఆర్ధరాత్రికే ఆయన అరెస్టు, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేయడం జరిగాయి.
దీంతో నేడు (నవంబరు 27) ఉదయం జగ్గు అరెస్టును నిరసిస్తూ, ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నీలాగా స్థాయి దిగజారి మేము మాట్లాడలేం. ఆడవాళ్ల గురించి నువ్వు మాట్లాడిన మాటలు మీ ఇంట్లో ఆడవాళ్లకు చూపించు.. వారికి సమ్మతమేనా? వాళ్లూ నోట్లో ఉమ్మేస్తారు. దూషించేది వైఎస్ఆర్ సీపీ నాయకులు.. కేసులు టీడీపీ నేతలపైనా?’’
‘‘అంత పోటుమొగోడివా నువ్వు. చంద్రబాబును చంపుతావా నువ్వు? లోకేష్ ను చంపుతావా నువ్వు? పరిటాల కుటుంబాన్ని భూస్తాపితం చేస్తానంటావా? రావయ్యా నువ్వు తేల్చుకుందాం. ఏది పడితే అది మాట్లాడడం కాదు. చంద్రబాబు గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోం. జగ్గు వ్యవహారంలో మేం కేసు పెడితే మీరు రిజిస్టర్ చెయ్యలేదు.’’
‘‘గంటాపురం జగ్గును అర్ధరాత్రి ఎందుకు అరెస్టు చేశారు. పోలీసు వాహనాల్లో జగ్గును అర్ధరాత్రి తీసుకువెళ్తుంటే వైఎస్ఆర్ సీపీ నాయకులకు ఎలా తెలిసింది? వెనకాలే వస్తున్న జగ్గు కుటుంబ సభ్యులపైన పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకులు ఎందుకు దాడులు చేశారు. గతంలో కూడా చెన్నే కొత్తపల్లి పోలీసులు ఇలానే వ్యవహరించారు. గంటాపురం జగ్గును విడుదల చేయాలి. అంతవరకు మేం ఆందోళన విరమించేది లేదు’’ అని పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర?
తెలుగుదేశం నాయకుడు గంటాపురం జగ్గుని పోలీసుల సమక్షంలోనే చితకబాదిన వైసీపీ నాయకులు చితకబాదారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు మూడు రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ గా తెలుగుదేశం నాయకుడు ఘంటాపురం జగ్గు మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఎలాంటి నోటీసులు లేకుండా జగ్గుని పోలీసులు ఆర్దరాత్రి అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కనగానపల్లి వైసీపీ కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి తన అనుచరులతో చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడి చేశారు.
గంటాపురం జగ్గుకు చెందిన వాహనాన్ని సైతం ధ్వంసం చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ధ్వంసమైన వాహనాన్ని పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు. మొదట జగ్గు కోసం బత్తలపల్లి ధర్మవరం పోలీస్ స్టేషన్లలో వైఎస్ఆర్ సీపీ నాయకులు వెతికారు. చివరికి చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి దాడి చేసినట్లుగా తెలిసింది. పోలీసుల ప్రేక్షక పాత్ర పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.