TTD News: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఆదివారం రంగు రంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో అర్చక స్వాములు స్నపన తిరుమంజనం చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.
అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో రంగురాళ్లతో కూడిన గాజుల మాలలు, ఆప్రికాట్ మాలలు, వట్టివేరుమాలలు, కురువేరుమాలలు, రంగురంగుల రోజామాలలు, పసుపు రోజామాలలు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మాలలు, తెలుపు ముత్యాల మాలలు, కిరీటాలు, తులసి మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు. అదేవిధంగా, హైదరాబాదుకు చెందిన శ్రీహరి, శ్రీధర్, శ్రీనివాస్ విరాళంతో రంగనాయకుల మండపంలో సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లతో విశేషంగా అలంకరించారు.
వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. సెప్టెంబరు 25వ తేదీ సోమవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డికి అప్పగించారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో మొట్టమొదటి మంగల కట్ట (కళ్యాణ కట్ట)ను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశపారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించడం ఎంతోకాలంగా ఆచారంగా వస్తోందన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగిందని చెప్పారు. 1946వ సంవత్సరంలో పంతులు గారి వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించారని తెలిపారు.
అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో పంతులుగారి వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి బంగారు గొడుగు ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోందన్నారు. పంతులు గారి వంశస్తులైన శివరామయ్య కుమారుడు రామనాథన్ గత 39 సంవత్సరాల నుంచి బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుంచి నాలుగు మాడ వీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారి రథానికి సమర్పిస్తున్నారని అన్నారు.