SIT officials inspect the flour mill at Tirumala in Andhra Pradesh | తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం విచారణ మూడో రోజు ముగిసింది. సోమవారం ఉదయం తిరుమలకు చేరుకున్న సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని సిట్ టీమ్ మూడోరోజు తనిఖీలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పిండిమరతో పాటు ల్యాబ్‌లో సిట్ టీమ్ దర్యాప్తు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములలో తనిఖీ చేశారు. తిరుమలలోని గోదాములో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది.
నెయ్యి కల్తీపై టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమలకు వచ్చిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. టీటీడీ ఈవో శ్యామలరావు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, నూనెలు కలిసినట్లు గుజరాత్ లోని ఎన్‌డీడీబీకి పంపించిన శాంపిల్స్ పరీక్షించగా తేలింది. దాంతో ఏపీ ప్రభుత్వం ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. శనివారం నాడు తిరుపతికి వచ్చిన సిట్ అధికారులు పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు వెళ్లి మొదట శ్రీ వెంకటేశ్వరస్వామిని (Tirumala Temple) దర్శించుకున్నారు.
నెయ్యిని చెక్ చేయడంపై సిట్ అధికారుల ఆరా
శనివారం, ఆదివారం రెండు రోజులు తిరుమలలో దర్యాప్తు చేసిన సిట్ టీమ్ మూడో రోజు సోమవారం నాడు విచారణ ముగిసింది. టీటీడీ తిరుమలకు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. తిరుమలలకు వచ్చే పదార్థాల నాణ్యను పరిశీలించడంపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మేషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సైతం సిట్ టీమ్ సేకరించింది. నెయ్యి సహా ఇతర పదర్థాల నాణ్యతను పరీక్షించే ప్రక్రియను సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు.
రేపు లడ్డూపోటు ఉద్యోగులను విచారణ
మూడో రోజు టీటీడీ గోదాములు, పిండిమర, ల్యాబ్ లను సిట్ అధికారులు తనిఖీ చేశారు. అయితే మూడో రోజు సమయం ముగియడంతో లడ్డూ పోటులో పనిచేసే ఉద్యోగులను విచారణ రేపటికి వాయిదా వేసుకున్నారు. లడ్డూ పోటు సిబ్బందిని సిట్ అధికారులు మంగళవారం నాడు విచారించి పలు విషయాలు తెలుసుకోనున్నారు. సోమవారం మూడోరోజు విచారణ పూర్తయిన తరువాత సిట్ అధికారులు తిరుపతికి వెళ్లిపోయారు.