తిరుమల: తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారింది. టీటీడీ అధికారులు తిరుమలకు వచ్చిన నెయ్యిని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి పంపగా, అక్కడ జరిగిన టెస్టుల్లో నెయ్యి కల్తీ అయినట్లు గుర్తింంచడం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. తిరుమలలో నెయ్యి కల్తీ ఘటనపై విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఇందులో భాగంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి తన టీమ్‌తో కలిసి శనివారం విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ కు మొదటగా వెళ్లారు. అటు నుంచి కొండమీదకు వెళ్లి తిరుమల శ్రీవారిని సిట్ టీమ్ దర్శించుకుంది. స్వామివారి ఆలయంలో తీర్థప్రసాదాలను అర్చకులు అందించారు. 


తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేపట్టడానికి వచ్చిన సిట్ టీమ్ శ్రీవారి దర్శనం చేసుకుని, స్వామివారి ఆశీర్వాదం తీసుకుంది. అనంతరం సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) దర్యాప్తు చేయడానికి సిద్ధం అయింది. స్వామివారి దర్శనం అనంతరం తిరుపతి పోలీస్‍ గెస్ట్ హౌస్‌లో సిట్‍ సభ్యులు సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ అపవిత్రం కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరుపై సిట్ టీంతో చీఫ్ త్రిపాఠి చర్చించారు. దాదాపు 2 గంటలకు పాటు సిట్ అధికారుల తొలి సమావేశం కొనసాగింది. ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంతో పాటు సున్నితమైన అంశం కనుక ఏ పొరపాటు జరగకుండా దర్యాప్తు చేయాలని సమావేశంలో అధికారులు చర్చించారు. 
మూడు బృందాలతో దర్యాప్తు
ముగ్గురు ఐపీఎస్‌ నేతృత్వంలో పోలీస్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి లడ్డూలో కల్తీ నెయ్యి సహా టీటీడీ వివాదంపై దర్యాప్తు చేయనున్నారు. సిట్‍ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ టీమ్స్ దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. ఎప్పటికప్పుడూ వారితో సమావేశమై దర్యాప్తును ముందుకు తీసుకెళతారు. సిట్‍ బృందం మూడు రోజుల పాటు తిరుమల, తిరుపతిలోనే ఉండి దర్యాప్తు కొనసాగించనుంది. సిట్‍ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేతభవనంలో ఆఫీసు ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో నెయ్యి డెలివరీ పరీక్షలు, ప్రస్తుతం తిరుమలలో నెయ్యి డెలివరీతో పాటు ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారని సిట్ ఫోకస్ చేస్తోంది. నెయ్యి డెలివరీకి టీటీడీ ఏ విధంగా టెండర్లను ఆహ్వానించింది, ఇతర అంశాల వివరాలను సిట్ సేకరిస్తోంది.


Also Read: Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ 


మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లాల్సి ఉండగా, డిక్లరేషన్ ఇవ్వాల్సిన కారణంగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాజీ సీఎంను అయిన తననే ఆలయానికి వెళ్లనివ్వడం లేదని, దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎన్నోసార్లు తిరుమలకు వెల్లి సీఎంగా పట్టు వస్త్రాలు సైతం సమర్పించిన తాను శ్రీవారిని దర్శించుకోకుండా ఆంక్షలు పెట్టారని జగన్ ఆరోపించారు.