Singanamala Assembly Constituency News: సింగనమల.. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత చుట్టూ రాష్ట్ర రాజకీయమే ముడిపడింది అనొచ్చు! ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారం చేపడుతుంది. ఇప్పుడు సింగనమల వైసీపీ అభ్యర్థి ప్రకటన విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మూడో జాబితా రానున్న తరుణంలో సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరదించబోతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఫేస్ బుక్ లైవ్‌తో వివాదం
మూడు రోజుల క్రితం సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ నియోజకవర్గానికి నీరు కావాలంటే అడుక్కోవాలా అంటూ తన ఫేస్బుక్ లైవ్ ద్వారా తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గమంటే అంత చిన్న చూపా అంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో తనకు ఎమ్మెల్యే టికెట్ రాదు అని జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఈ విధంగా మాట్లాడి ఉంటారని చర్చించుకుంటున్నారు. అనంతరం నేను ఒక రకంగా మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వేరొకరకంగా దాన్ని చిత్రీకరించాయంటూ మరొక వీడియోను ఎమ్మెల్యే పద్మావతి విడుదల చేశారు.
అనంతరం తాడేపల్లి సీఎంవో నుంచి జొన్నలగడ్డ పద్మావతికి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మీటింగ్ అనంతరం జొన్నలగడ్డ పద్మావతి మీడియా ముందుకు వచ్చి నాకు జగనన్న టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను జగనన్నతోనే ఉంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటోనని అసలు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తున్నారా లేదా అన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆశవహులు ఎక్కువే..
మరోవైపు సింగనమల వైసీపీ టికెట్ కోసం ఆశావాహులు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన యామిని బాల ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ తరఫున టికెట్ తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే యామిని బాల సోదరుడు అశోక్ సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.
ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న సింగనమలలో ఓ పోలీసు అధికారి కూడా టికెట్ రేసులో నిలిచాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ శ్రీనివాసమూర్తికి దాదాపుగా వైసీపీ టికెట్ వచ్చేసింది అన్నట్టుగా జిల్లాల జోరుగా ప్రసారం సాగుతోంది. డిఎస్పి శ్రీనివాస్ మూర్తికి వైసీపీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం సింగనమల నియోజకవర్గం వర్గంపై పలు రకాలుగా సర్వేలు చేయిస్తూ వస్తుంది. ఈ సర్వేల ఆధారంగానే ఎవరికి టికెట్ కేటాయించాలని అధిష్టానమే నిర్ణయించునున్నది. అయితే ఈరోజు లేక రేపు మూడో జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సింగనమల నియోజకవర్గం లో ఎవరు బరిలో ఉంటారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.