Tirupati Deputy Mayor byelections:  తిరుపతి మున్సిప్ల డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఉప మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమిని ప్రజాస్వామ్య ఓటమిగా మాజీ మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీషని విధుల నిర్వహణలో అవమానించారని ఆమె మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ శిరీష ఆందోళన చేసే పరిస్థితి  దేనికి సంకేతమని ప్రశ్నించారు. తిరుపతి ఎంపి గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సు పై దాడి చేశారని..  నిన్న బస్సులో బయలుదేరిన వైసీపీ కార్పొరేటర్లు ఇవాళ రాలేదన్నారు.  మాతో నిన్న వచ్చి నేడు ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు కొనసాగింపు కాదా అని ప్రశ్నించారు. 

మున్సిపల్ కార్పొరేషన్‌ లో ఒక్క ఓటు ఉన్న టీడీపీ కార్పొరేటర్ తిరుపతి డిప్యూటీ మేయర్‌గా గెలిచారన్నారు. వైసీపీ విప్ జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి మా సభ్యులు విప్ దిక్కరించిన కారణంగా కార్పొరేటర్లను  అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ అవేమీ జరగలేదని, జరిగిన పరిస్థితిని గమనిస్తే తిరుపతిలో ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయో అందరికీ అర్థమవుతుందని ఆర్కే రోజా మండిపడ్డారు.               

మేము ఓడి గెలిచాం, టీడీపీ వాళ్లు గెలిచి ఓడిపోయారు. అంతిమంగా ఒకటే చెపుతున్నా.. ఇక్కడ మేం ఓడిపోలేదు.. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో గెలిచాయని ఆర్కే రోజా  స్పష్టం చేశారు.  తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారితోపాటు రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారే దీనికి సమాధానం చెపుతారని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వైసీపీ కార్పొరేటర్ లడ్డూ భాస్కర్ తరపున మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రాధాకృష్ణ ప్రతిపాదించారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ తరపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేటర్ అన్నై అనిత ప్రతిపాదన చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి  21 ఓట్లు పడగా... టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 ఓట్లు వచ్చాయి. దాంతో తిరుపతిలో ఏకైక టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా విజయం  సాధించారు.                                          

Also Read: Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు