Road Accident in Chandragiri in Tirupati District | చంద్రగిరి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి (మ) రంగంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి భక్తులను 108 వాహనం ఢీకొనడంతో ఇద్దరు భక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. రామసముద్రం మండలం నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా మార్గం మధ్యలో భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని సెగంవారి పల్లికి చెందిన లక్ష్మమ్మ, చంపానపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మగా గుర్తించారు. పొగ మంచుతో రోడ్డు కనిపించక భక్తులపై నుంచి 108 వాహనం దూసుకెళ్లింది. నిమ్మనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్తున్న 108 వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ శ్రీవారి భక్తులను తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.