Madanapalli Peddireddy Lands Issus: గత వైసీపీ ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అయన కుటుంబ సభ్యులు వారి అనుచరులు ప్రభుత్వ, ఫారెస్ట్ భూములను కబ్జా చేశారని కూటమి నేతలు ఆరోపించారు. ఇటీవల చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేటలో ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు 6 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మదనపల్లిలోని బికేపల్లిలో గల సర్వేనెంబర్ 552/1 పార్ట్ నందలి విస్తీర్ణం 1.35 ఎకరాలప్రభుత్వ ఆక్రమిత భూమిని సోమవారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ధనుంజయులు తెలిపారు. మదనపల్లె శివారు ప్రాంతమైన బికే పల్లె జాతీయ రహదారికి పక్కన ఉండడంతో అక్కడి భూములు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమి ఉంది. పెద్దిరెడ్డి.. తన కుటుంబ సభ్యుల పేరు పైకి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేసుకున్నారు.
552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. జాతీయ రహదారి ఎన్ హెచ్ 42ను ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఒక ఎకరా భూమి కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు అటు ప్రభుత్వానికి, ఇటు జిల్లా యంత్రాంగానికి పలు ఫిర్యాదులు అందడంతో.. ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది.
మదనపల్లి రెవెన్యూ యంత్రాంగం, సర్వే అధికారులు దీనిపై దృష్టి సారించి ఆక్రమిత భూమిని గుర్తించి, భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించి ప్రభుత్వ భూమికి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరు ఆదేశాలతో సోమవారం రెవిన్యూ మరియు సర్వే సిబ్బంది బృందం రికార్డులను అనుసరించి మొత్తం భూమిని సర్వే నిర్వహించారు. ఇందులో 1.35 ఎకరాల భూమి కబ్జా కు గురైందని, ఇందులో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సర్వే నెంబరు 552/1 పార్ట్ లోని ప్రభుత్వ భూమి 1.35 సెంట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సదరు భూమిలో ఉన్న రాళ్లు, కంచెలను తొలగించి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసారు.
మరిన్ని భూములపై దర్యాప్తు
మదనపల్లె రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ , ఫారెస్ట్ భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అయన కుటుంబ సభ్యులు , వారి అనుచరులు ఇంకా ఎక్కడ కబ్జాలకు పాల్పడ్డారు అనే విషయం పై అరా తీస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఐదేళ్ళ లో రెవిన్యూ రికార్డ్స్ మార్చి ప్రభుత్వ , ఫారెస్ట్ ల్యాండ్ లు మారిన వాటిపై నిఘా పెట్టి వాటి రికార్స్ పరిశిలన చేస్తున్నారు. త్వరలో మరిన్ని భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.