Raw NTR Shot Down: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడనే వార్త వైరల్ అయ్యింది. ఎన్టీఆర్‌ను గట్టిగా సపోర్ట్ చేసే రా ఎన్టీఆర్ పేరుతో రన్ అయ్యే ఆర్గనైజేషన్ చేసిన హడావుడి దీనికి ఊతమిచ్చింది. తిరుపతిలో ప్రెస్‌మీట్ ఉందని, దీనికి ఎన్టీఆర్ వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అసలు రా ఎన్టీఆర్‌తో తమకు సంబంధం లేదని కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది. ఇంత జరిగినా రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ తరుఫున తామే ఊరు వాడ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్వయంగా ఆపేయాలని ప్రకటిస్తే మొత్తం ఆపేస్తామని తెలిపారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మొత్తం అన్నింటిని ఆపేస్తున్నట్టు రా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.
ప్రస్‌మీట్ పెట్టి వివరాలు చెప్పిన రాఎన్టీఆర్ ఆర్గనైజర్
జూలై 18న తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయిరూప్ కీలక విషయాలు ప్రస్తావించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచనతో దీన్ని రాఎన్టిఆర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. దీనికో వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ చెప్పే వరకు తగ్గేదేలే అన్న సాయిరూప్
ఎన్టీఆర్ జిల్లా నుంచే ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సాయిరూప్ తిరుపతిలో ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ అడిగితే రెడీ చేసిన సినిమా స్క్రిప్టు మాదిరి మొత్తం ఈ ఊరు వాడ ప్లాన్ వివరిస్తామని పేర్కొన్నారు. అంతా విన్న తర్వాత ఆపే సాయి వెంటనే ఒక హగ్ ఇచ్చి అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేస్తానంటూ తెలిపారు. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అన్నా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తా అని అన్నారు.
రాత్రికి రాత్రే మూసేసిన రా ఎన్టీఆర్
ఎన్టీఆర్ చెప్పే వరకు ఊరు వాడ ఆపేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పిన వ్యక్తి రాత్రికి రాత్రే మొత్తం షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిమానుల ఒత్తిడి మేరకు ఇలా చేశారా? లేకుంటే ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి రచ్చ వద్దని కోపడ్డాడా అనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు.
అన్నింటిని షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్, ఇందులో విజయం సాధించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పడం కొసమెరుపులా ఉంది. ఇది ఎవర్ని ఉద్దేశించిన చేసిన కామెంట్ అనే డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన రా ఎన్టీఆర్ ఊరు వాడ ఎపిసోడ్ ప్రస్తుతానికి అలా ముగిసింది.
