TDP leader Ganta Narahari Arrest:
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత గంటా నరహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంటా నరహరి అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల పరామర్శ యాత్ర చేపట్టారు. ప్రాజెక్టు బాధిత గ్రామాల పర్యటనకు బయలుదేరిన టీడీపీ నేతను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గంటా నరహరిని అదుపులోకి తీసుకుని రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు, శనివారం రాత్రి నుంచే పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేయడంతో పార్టీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, అనంతరం తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ప్రజల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు గంటా నరహరి. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులకు సీఎం జగన్ హామీ ఇచ్చినా ఏపీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. బాధితులకు న్యాయం కోరితే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం ఏర్పాటుకాగానే వారికి న్యాయం చేస్తామన్నారు. అప్పటివరకూ జగన్ సర్కార్ తో బాధితుల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఏ వర్గాన్ని వదిలిపెట్టడం లేదని, అందరికీ అన్యాయం చేసి.. ఎన్నో చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.