పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కు అడుగడుగునా చేదు అనుభవం ఎదురవుతోంది. వైసీపీ‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు నేరుగా ప్రజల‌ వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలను‌ తెలియజేస్తున్నారు. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజల నుండి వ్యతిరేకత వస్తూనే ఉంది. నాలుగేళ్ళ తరువాత మా గ్రామానికి ఎందుకు వస్తున్నావంటూ ప్రజలే నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్కడి నుండి వెనుదిగాల్సిన పరిస్ధితి వస్తుంది.  


చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ‌‌ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు గత కొద్ది‌ రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరవుతూ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా వింటూ వాటిని పరిష్కారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేకు మాత్రం చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. రెండు నెలల క్రితం అమ్మగారిపల్లె, చిన్నబండపల్లె గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళిన ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు అడ్డుకుని తమ గ్రామానికి రావద్దంటూ రోడ్డుపై బైఠాయించి‌ నిరసన తెలిపారు.  


తమపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులకు సర్ధి చెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించక పోవడంతో చేసేది లేక అక్కడి‌ నుండి వెను తిరగాల్సిన పరిస్ధితి నెలకొంది. అటు తరువాత బంగారుపాళ్యం మండలం, మొగిలివారిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే తమ గ్రామంలో పర్యాటించేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని గ్రామం అంతా సైకీ పోవాలి సైకిల్ రావాలి అంటూ  బ్యారి గేట్లు పెట్టి, గ్రామం భజన గుడి వద్ద టిడిపి పాటలను వేసి, గ్రామస్తులు అంతా ఇండ్లకు తాళ్ళలు వేసుకున్నారు. ఐతే ఈ వ్యవహారంను గమనించిన ఎమ్మెల్యే భజన గుడి వద్ద పాటలను ఆపేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యేను అడ్డుకుని తమ గ్రామం నుండి తక్షణమే బయటకు వెళ్ళాలంటూ నినాదాలు చేశారు.  


దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తనను అడ్డుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని, వీరిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తాంమని హెచ్చరించారు. అటుతరువాత కొద్ది రోజులు విరామం తీసుకున్న ఎమ్మెల్యే తిరిగి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ప్రారంభించారు. ఈ క్రమంలోనే  గురువారం పూతలపట్టు నియోజకవర్గం, తెల్లగుండ్ల పల్లెలో ఎంఎస్.బాబు పర్యటించేందుకు వెళ్ళగా అక్కడి గ్రామస్తులు నిరసనకు దిగ్గారు. గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి స్థానికులు ఇళ్లకు తాళాలు వేశారు. తెలుగుదేశం జెండాలను గ్రామంలోని ఇళ్లపై కట్టారు.  


"మా గ్రామానికి ఏమి చేశావు. ఎందుకు వస్తున్నావంటూ" ప్రశ్నలతో బ్యానర్లను కట్టి శాంతియుత నిరసన తెలిపారు. అయితే గ్రామ అధికారులు టిడిపి జెండాలను తొలగించారు. పోలీసులు అడుగడుగునా పహారా కాస్తూ, అక్కడి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని గ్రామంలో నిలుపకుండానే వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెనుతిరగడంతో రెవిన్యూ, పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు టిడిపి బ్యానర్ తొలగించాలని పోలీసులు బెదిరింపులకు దిగడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.