AP Elections 2024: పుంగనూరు నియోజకవర్గం ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి పోటీ చేస్తే అభ్యర్థుల పేరు ఒకేలా ఉండడం వల్ల ఓటర్లకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పేర్లు పరిశీలించడంతో పాటు గుర్తులు బట్టి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.


ప్రతి ఎన్నికల్లో సాధారణంగా అభ్యర్ది పేరుతో పాటు వారి పార్టీ గుర్తులను చూసి ఓటు వేస్తారు. ఎక్కువ మంది పేర్లపై ఆధారపడుతారు. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈసారి RRR పోటీ చేస్తున్నారు. 


RRR అంటే..! 
RRR ఏంటి పుంగనూరు నుంచి పోటీ ఏంటీ.. అనుకుంటున్నారా? R అంటే పుంగనూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. R అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, R అంటే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. ఈసారి వీరు ముగ్గురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.


అభివృద్ధికి ఏమి చేస్తారు
నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన రోడ్లు తప్ప మారే అభివృద్ధి జరగలేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. 10 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కనుసన్నల్లో అధికారులు పని చేసి ప్రజలకు అందాల్సిన భూములను ఆక్రమించారని, ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించారని, పాల ధరలు సైతం అతి తక్కువ ధరకు ఇచ్చి ప్రజలకు నరకం చూపించారని అంటున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టుల పేరుతో మొత్తం డబ్బు పక్కదారి పట్టించి పనులు పూర్తి చేయకుండా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే తాము ప్రజలకు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నెరవేర్చామని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ప్రజలకు ఏమి చేస్తామనేది విస్మరించి గతంలో చేసిందే.. చేయనిది చెబుతున్నారని ప్రజలు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ రామచంద్ర ను అధికార పీఠం ఎక్కిస్తారో వేచి చూడాలి.