Vote from Home Guidelines Here: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది.


ఎవరు అర్హులు
ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కొందరికే అవకాశం కల్పించింది. పోలింగ్ బూత్ కు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్దులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. పోలింగ్ బూత్ కు వచ్చే వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేదు. నడవలేని స్థితిలో తీసుకెళ్లలేని వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక ప్రతిభావంతులకు కావాల్సిన ర్యాంప్ లు, వీల్ చైర్స్ అందుబాటులో ఉంటాయి.


దరఖాస్తు చేయాలి
ఇంటి నుంచి ఓటు వేసే వారిని ఇప్పటికే ఆయా ఆర్వోల పరిధిలో గుర్తించారు. సంబంధిత ఎన్నికల అధికారులు వారి ఇంటికి వెళ్లి ఫారం 12డి ని అందజేస్తారు. ఈ ఫారం నింపి తమ బీఎల్వో లకు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైతే తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ ను వారికి అందజేస్తారు.  దరఖాస్తు సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెబితే అలాంటి వారికి ఫారం 12డి ఇవ్వరు.


ఓటింగ్ సరళి ఎలా 
ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం పొందిన అర్హులు నుంచి రహస్య పద్దతిలో ఓటింగ్ నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నియమించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం లో ఓటర్ నివాసానికి పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. ఈ సిబ్బందిలో ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక పోలీస్ శాఖ సిబ్బంది, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారు. ముద్రించిన పోస్టల్ బ్యాలెట్ ను వారికి అందించి రహస్యంగా ఓటు వేయిస్తారు. దానిని ఓటర్ బ్యాలెట్ బాక్స్ లో వేసేంత వరకు అంత రహస్యంగా ఉంటుంది. ఓటింగ్ ముందస్తుగా  జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం మీ పరిధిలోని బీఎల్వోను సంప్రదించగలరు.