Tirumala News: తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించి కోట్ల మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని భక్తులు పరితపిస్తారు. ఒక్కసారి స్వామి వారి దర్శనం చేసుకుంటే మళ్లీ.. మళ్లీ చూడాలనే తపన భక్తులకు కలుగుతుంది. క్షణకాలంపాటు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి తరలి వచ్చే భక్తుల మనోభావాలతో ముడి పడిన అంశం కావడంతో చాలా జాగ్రత్తగా ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది.


రాజకీయ కోణంలో చూడాలా..?
తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆలయం బయట తన సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఐదేళ్ల కాలంలో అటు ప్రభుత్వ పెద్దలు.. ఇటు ప్రతిపక్ష నాయకులు సైతం రాజకీయ కేంద్రంగా ఆరaపణలు చేసుకోవడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పూర్తిగా స్వస్తి పలికారు. తిరుమల ఆలయం వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు లేకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయినా కూడా అడపదడపా రాజకీయ అంశాలు వస్తునే ఉన్నాయి.


ప్రాథమిక నివేదిక ఆధారంగా తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టి స్వామి వారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో కూరగాయలు నూనె కలిసింది అని టీటీడీ నూతన ఈవోగా వచ్చిన శ్యామలరావు వెల్లడించారు. అది జరిగిన కొన్ని రోజులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని అన్నప్రసాదాల నాణ్యత లేదని తాము వచ్చాక అవి అన్నింటిని మార్పు చేశామని చెప్పారు. అది నిజం అంటూ టీటీడీ ఈవో, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం తేల్చారు. టీటీడీ చెబుతున్న తమిళనాడు రాష్ట్ర ఏఆర్ డైరీ పూడ్ ప్రొడెక్ట్స్ పై టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించారు. డైరీ వారు సైతం తమ నెయ్యి నాణ్యత ఉంది.. ఎక్కడైన పరీక్షలు చేసుకోవాలి అంటూ వారు మరొక్క నివేదిక ఇచ్చారు. 
ఇది నిజంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రకటన చేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. లడ్డూ పై బహిరంగంగా ఆరోపణలు చేయడాన్ని జగన్‌ కూడా తీవ్రంగా విమర్శించారు. మొత్తం వ్యవహారంపై కొందరు భక్తులు మరోలా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించి ప్రకటన చేసింటే బాగుండేదని భక్తుల వాదన. 


నెయ్యి ఐదు సంస్థలు సరఫరా
టీటీడీకి ఐదు మంది సరఫరాదారులు నెయ్యి ఇస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డెయిరీ.  రూ. 320 నుంచి రూ. 411 మధ్య ధరలు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని) నెయ్యిని కూడా పరీక్షలు నిర్వహించి వినియోగిస్తున్నారు. వీటి ధర ప్రస్తుతం 478 రూపాయలు గా నిర్థారించారు. 


గో ఆధారిత ముడి సరుకుల తాత్కాలిక రద్దు
టీటీడీలో గత ఐదేళ్లుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పంటలను స్వామి వారికి నైవేద్యాలు, అన్నప్రసాదాలు పంపుణీ చేసేవారు. 2021లో ఈ విధానాన్ని ప్రారంభించారు. గో ఆధారిత ఉత్పత్తులపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టిటిడి ఈఓ తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.