Srikalahasthi: భారతదేశంలో పంచభూత లింగాల్లో ప్రసిద్ది గాంచింది శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వయంభుగా పరమశివుడు కొలువు దీరాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది తీరాన శ్రీకాళహస్తి క్షేత్రం పంచభూత లింగాల్లో నాల్గొవదిగా వెలిసింది. అందుకే గ్రహణ కాలంలో అన్ని క్షేత్రాలు మూసి వేసినా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం తెరిచే ఉంచి, ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయం గ్రహదోష పరిహారాలకు పెట్టింది పేరుగా చెబుతారు. రాహు-కేతు దోషాలు తొలగించుకునేందుకు ప్రతి నిత్యం వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. 


ఈ క్షేత్ర విశిష్టత ప్రకారం ఇక్కడ వెలసిన వాయు లింగేశ్వరుడికి సాలె పురుగు, పాము, ఏనుగు తొలుత స్వామి వారిని సేవించుకున్నాయని చెబుతారు. ఈ ఆలయంలో స్వామి వారికి ఎటువంటి ఆకారం ఉండదు. గాలి కంటికి కనిపించదు కాబట్టి చుట్టూ గాలి చొరబడేందుకు కూడా వీలులేని గర్భాలయంలో వెలిగే జ్యోతులు నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా వాయులింగేశ్వరుడిని దర్శించిన అనంతరం జ్ఞానప్రసురాంభా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ పాలక మండలి, అధికారులు నూతన షరతులు పెట్టారు. ఎవరైనా సరే కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సందేనని అంటున్నారు. ఇంతకీ శ్రీకాళహస్తి ఆలయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


దర్శనానికి వచ్చే వారు ఇవి గుర్తుంచుకోవాలి


అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుండి ఆలయంలోకి కెమెరాలు, సెల్‌ఫోన్ల అనుమతిని రద్దు చేసారు. అంతే కాకుండా అంతర్ దర్శనం కోసం వచ్చే ప్రోటోకాల్, విఐపి భక్తులు కూడా ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతించాలని ఆలయ పాలక మండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు ఫోటోలు నిషేధిత ప్రాంతాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్రమత్తమైన ఆలయ పాలక మండలి, అధికారులు దేవాదాయ శాఖా అనుమతి మేరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. 


ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటుండటంతో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత మూడేళ్ళుగా కొన్ని అనివార్య కారణాలతో నిలిపి వేసిన స్వర్ణముఖి ‌నది హారతీని కార్తీక మాసం 2వ వారంలో నిర్వహించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లపై ఆలయ పాలక‌మండలి, అధికారులు చర్యలపై దృష్టి పెట్టారు. కార్తీక మాసంలో నది స్నానం ఆచరించేందుకు స్వర్ణముఖి నది తీరాన స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే మహిళా భక్తుల కోసం నెయ్యి దీపాలు వెలిగించుకునేందుకు ప్రత్యేకంగా స్ధల కేటాయింపు చేసింది. ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించేందుకు స్ధలం కేటాయింపుపై మహిళా‌ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.