Uravakonda News: అనంతపురం జిల్లాకు ఐదు సంవత్సరాల కాలంలో జగన్ ఏం చేశారు చెప్తారని ప్రజలు ఎదురు చూశారని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లాకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని.. అవన్నీ ఇప్పుడు నెరవేర్చరా అని నిలదీశారు. జగన్ ప్రసంగం అంత చంద్రబాబు నాయుడును విమర్శించటానికే సరిపోయిందని అన్నారు. ప్రజల పక్షాన ఉన్న పత్రికా సంస్థలను.. వారి యజమానులను ఆడిపోసుకోవడానికి సరిపోయిందని ఆరోపించారు. మంగళవారం పయ్యావుల కేశవ్ ఉరవకొండలో మీడియాతో మాట్లాడారు. 


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగాని వాడిలా.. వాళ్లంతా ఏకమయ్యారు అని సానుభూతి పొందడానికే ఈ ప్రకటనలు చేస్తున్నాడు. నిన్నటి వరకు ప్రతిపక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలియదా..? ప్రతిరోజు నాయకులని అనవసరంగా హౌస్ అరెస్టులు తోటి, పోలీసులతో, సీఐడీ అధికారులతో ఇబ్బందులకు గురి చేశారు. మీ ధైర్యం ఎక్కడ పోయింది.. మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్? అధికారం పోతుందన్న భయంతో జగన్ ఇలా మాట్లాడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్. నీ ధన దాహం కోసం తెచ్చిన జే బ్రాండ్ కల్తీ మద్యం ద్వారా జీవితాన్ని కోల్పోయి తాళిబొట్టు తెగిపోయిన వారందరూ మా పార్టీకి స్టార్ క్యపెయినర్ లే. 


ఐదేళ్లలో కనీసం 5 ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా? హంద్రీనీవాలో పనులను 50 శాతం మేము పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం తట్టెడు మన్ను ఎత్తలేకపోయారు. భారతదేశంలో అద్భుతమైన మెగా డ్రిప్ పథకాన్ని నిలిపివేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి ఒక కంపెనీ కూడా రాలేదు. విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒకటైన నిజం చెప్తారు అనుకున్నా. ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు నీకు ఎన్ని పేర్లు పెట్టారు ఒక్కసారి కనుక్కో.. నేను వలసపక్షి అంటున్నావు.. నువ్వు వసూళ్లపక్షివి. ఉరవకొండ నియోజకవర్గానికి నేనేం చేశాను చెప్తాను నువ్వేం చేసావో చెప్తావా..?


ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా విశ్వేశ్వర రెడ్డి. నువ్వు జనం కోసం మాట్లాడుతున్నావా లేక జగన్ కోసం మాట్లాడుతున్నావా.. మహానుభావుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఈ వివాదాల్లోకి లాక్కండి. ఉరవకొండ పట్టణంలో పేదల కష్టాలను తీర్చేందుకు పయ్యావుల కేశవ్ వంద ఎకరాల భూమిని సేకరించాడు. నువ్వు ఒక చేతకాని దద్దమ్మవి. జిబిసి ద్వారా రూ.300 కోట్లు రైతులు నష్టపోయేలా చేసిన వ్యక్తి నువ్వు. అదే రూ.300 కోట్లతో జిబిసికి మరమ్మత్తులు చేయించినది పయ్యావుల కేశవ్. పేదవాడు ఇల్లు కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా లేదు.


నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే నిరూపించండి. అమరావతిలో నా డబ్బుతో భూములు కొన్నా. అసెంబ్లీలో కూడా ఇదే చెప్పా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఈ ప్రభుత్వం 5 ఎంక్వయిరీ నామీద వేసింది.. ఏమైనా నిరూపించారా..? నాకు ఉరవకొండ ప్రజలే దేవుళ్ళు.. వారి కోసం నా శాయశక్తులా పనిచేస్తా’’ అని పయ్యావుల కేశవ్ మాట్లాడారు.