Tirumala Prasada laddu adulterated ghee scam: 2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన కల్తీ స్కాంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. వారు మన నమ్మకాన్ని విచ్చిన్నం చేశారని భావోద్వేగంతో ట్వీట్ పెట్టారు.
భక్తుల విశ్వాసాన్ని దెబ్బకొట్టారు !
మన తిరుమల కేవలం ఆలయం కాదు.. అది మన భక్తికి మూలమన్నారు. గత ప్రభుత్వ హయాంలో (2019–24), అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది - మీ కుటుంబం, మీ పొరుగువారు, మనమందరం తిరుమల ఆలయానికి వెళ్లామన్నారు. ఒక్కసారి ఆలోచించండి - ప్రతిరోజూ 60,000 మంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారు. సాధారణ సామాన్యుడి నుండి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖుల వరకు - పరిశ్రమల దిగ్గజాలు మరియు క్రీడలు, కళలు మరియు సాహిత్యం నుండి ప్రముఖులతో పాటు అందరూ తిరుమలకు వెళ్లారన్నారు. మనం ఎంతో భక్తి భావంతో వెళ్తే.. మునుపటి TTD బోర్డు మరియు దాని అధికారులు మన హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మన భక్తికి ద్రోహం చేశారు.. ప్రతి ఒక్క భక్తుడు మోసపోయాడు. వారు నియమాలను ఉల్లంఘించలేదు - మనం వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారన్నారు.
2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల కాలంలో మొత్తం 48.76 కోట్ల లడ్డూలు తయారు చేయగా, అందులో 20.1 కోట్ల లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు అంచనా వేశారు. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో జంతు కొవ్వు మిశ్రమం ఉన్నట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నివేదికలు ధ్రువీకరించాయి.
భోలే బాబా డెయిరీ సహా పలు సంస్థలు కల్తీ నెయ్యి సరఫరాలో పాలుపంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణం ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడంతో సిట్ దర్యాప్తు మొదలైంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.