No special darshan at Tirumala Temple from 10 January to 19 | తిరుమల: వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. పది రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. జనవరి 10వ తేదీన ఉదయం 4:30 గంటలకు వీఐపీ దర్శనాలతో స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే ఈ పది రోజుల్లో 7.50 లక్షల మందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశాం. కాలిబాటలో జనవరి 19 వరకు ఎలాంటి ఎలాంటి టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు.
టీటీడీ ఈవో శ్యామలరావు ఇంకా చెప్పారంటే..
జనవరి 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు వాహన మండపంలో మలయప్పస్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. జనవరి 11న ఉదయం 5:30 గంటలకు చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తాం. తిరుపతిలో సర్వదర్శన 9 తేదీన ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. మిగతా టోకెన్లు రోజువారీగా మూడు కేంద్రాల్లో జారీ చేయనున్నాం. శ్రీవారి సర్వ దర్శన భక్తుల దర్శనం జనవరి 10న ఉదయం 8 గంటల ప్రారంభం అవుతుంది. దాదాపు 3 వేల మంది పోలీసులు, 15 వందల మంది సిబ్బందితో వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు భద్రత కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పది రోజుల సమయంలో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని, ప్రత్యేక దర్శనాలకు అనుమతించడం లేదని టీటీడీ ఈవో తెలిపారు.
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. మొదట తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా తొలిసారి, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం పర్వదినం, వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుపుతారు. మంగళవారం (జనవరి 7న) జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జే శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.