యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివిధ వర్గాలకు చెందిన ప్రజల్ని కలుస్తూ వెళ్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీల వద్ద సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ తిరుపతి సమీపంలో రేణిగుంటలో పర్యటిస్తుండగా అక్కడ జోహో ఐటీ కంపెనీని సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన కంపెనీ వల్ల అక్కడ మహిళా ఉద్యోగినులు సంతోషంగా ఉన్నారని, వారితో ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. 


ఈ సందర్భంగా నారా లోకేశ్ సీఎం జగన్‌కు ఓ సవాలు విసిరారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి తెచ్చిన కంపెనీల ముందు సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని సవాలు చేశారు.


‘‘జగన్ రెడ్డి ఇదిగో నేను రేణిగుంటకు తెచ్చిన జోహో ఐటీ కంపెనీ.. జోహో కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూడు జగన్ రెడ్డి. ఇక్కడ వంద మంది యువతీ, యువకులు పని చేస్తున్నారు. నీ హయాంలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేసి, ఉద్యోగాలు లేకుండా చేసే జగన్ రెడ్డికి ఉద్యోగం వస్తే యువతీ, యువకులు పడే ఆనందం గురించి తెలియాలి అనుకోవడం అత్యాశే అవుతుంది’’






‘‘టిడిపి హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చెయ్యాలని కోరుతున్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంటలో ఏర్పాటు చేసిన‌ జోహో సాఫ్ట్ వేర్ కంపెనీని సందర్శించి అక్కడ ఉద్యోగులతో సెల్ఫీ దిగాను. వై.కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో స‌మావేశ‌మ‌య్యాను. తిరుపతి నియోజకవర్గంలో నా పాద‌యాత్ర ప్రవేశించింది’’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.


అల్లూరి జిల్లాలో ఘటనపైనా ట్వీట్


‘‘జ‌గ‌న్ రెడ్డి గారి అధ్వాన పాల‌న‌కి మ‌రో ప‌సిగుడ్డు క‌ళ్లు తెర‌వ‌కుండానే క‌న్నుమూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండ‌లం తీగ‌ల‌వ‌ల‌స పంచాయ‌తీ ప‌న‌స‌బంద గ్రామానికి చెందిన భానుకి గ‌ర్భశోకం మిగిల్చింది వైసీపీ స‌ర్కారు నిర్లక్ష్యమే. పురిటినొప్పులు వ‌చ్చిన గ‌ర్భిణిని తీసుకెళ్లేందుకు స‌రైన రోడ్డు లేదు, 108 వాహనం రాదు, మేము తెచ్చిన ఫీడ‌ర్ అంబులెన్సులు మూల‌న పెట్టేశావు. దిక్కుతోచ‌ని స్థితిలో డోలీపై భానుని ఆస్పత్రికి త‌ర‌లిస్తే బిడ్డ అడ్డం తిరిగి చ‌నిపోయింది. ఈ పాపం నీదే జ‌గ‌న్ రెడ్డి!’’ అని నారా లోకేశ్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.