ఆంధ్రా సీఐడీ బెదిరింపులకు భయపడేది లేదని.. వారికి సవాల్ విసురుతున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తేల్చి చెప్పారు. తమపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని సీఐడీకి సవాలు విసిరారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును 48 రోజులుగా జైల్లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు. అయినా చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, ములాఖత్‌కు వెళ్లినప్పుడు కూడా ఆయన ధైర్యం కోల్పోలేదని అన్నారు. ప్రజల నుంచి చంద్రబాబును ఎవరూ దూరం చేయలేరని అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. 


చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లే వాళ్లం. నిన్న మాత్రం ఒంటరిగా తిరుమలకు వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్టుతో మా కుటుంబసభ్యులం మొత్తం నాలుగు దిక్కులుగా విడిపోయాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీడీపీ కార్యకర్తల డబ్బులతో బతకాల్సిన అవసరం లేదని అన్నారు. క్రమశిక్షణగా ఉండడం.. క్రమశిక్షణ నేర్పించడం చంద్రబాబుకు తెలుసని అన్నారు.


‘‘రాజమండ్రి జైలుకు ములాఖత్ వెళ్ళినప్పుడు చంద్రబాబు ధైర్యంతో ఉన్నారు. ఎప్పుడు ములాఖత్ కు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. త్వరలోనే నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతోనే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మీ ఓటును ఆలోచించి వేయండి. నాకు ఇంకా పౌరుషం ఉంది.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు చేసి‌న సాయాన్ని మహిళలు మరిచి‌పోలేదు. అందుకే చంద్రబాబు కోసం‌ మహిళలు రోడ్డుపైకి‌వచ్చారు.


పనికిరాని వాటిపై ఎంక్వైరీ ఏంటి? - భువనేశ్వరి
దసరా పండుగ సందర్భంగా చంద్రబాబు లేఖ రాస్తే దానిపై ఎంక్వైరీ చేస్తారా? అభివృద్ధి చేయాలనే అలోచన ప్రభుత్వానికి ఉండాలే‌ గానీ పనికి రాని వాటిపై ఎంక్వైరీ ఏంటీ? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదు. జీవితంలో‌ ఇలాంటి‌ అడ్డంకులు వస్తాయని ఏనాడు అనుకోలేదు. న్యాయం‌ జరుగుతుందనే కుటుంబం అంతా కలిసి‌ కట్టుగా ఉన్నాం. జైలులో ఉన్న చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో‌ వైసీపీ ఉంది. భోజనం‌ కూడా‌ సరైనది పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. నాకు ఎంత‌ బాధ ఉన్నా, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబును ఎవరూ ముట్టుకోలేరు’’ అని నారా భువనేశ్వరి మాట్లాడారు.


చంద్రబాబు రాజకీయ జీవితం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచే ప్రారంభమైంది. ఆయన సూచనలతోనే చనిపోయిన వారి బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ గొప్పతనం ఏంటంటే.. అరెస్టులు, కేసులతో వేధించడం మాత్రమే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆనాడు మహాత్మా గాంధీ పోరాటం చేస్తే మనమిప్పుడు వైఎస్ఆర్ సీపీ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. మనం చేసే పోరాటం భవిష్యత్తు కోసమే. టీడీపీ కార్యకర్తల్ని భయపెట్టడానికి అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరూ భయపడకండి.. అందరం కలిసికట్టుగా పోరాడదాం’’ అని నారా భువనేశ్వరి మాట్లాడారు.