పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరి ఎన్ని యాత్రలు చేసినా సీఎం జగన్ జైత్ర యాత్రను మాత్రం ఆపలేరని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్ దే అని అన్నారు. వెనుకబడిన వర్గాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. శింగనమల నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్ యాత్ర బుక్కరాయసముద్రం చేరుకుంది. బుక్కరాయసముద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాతికేళ్లు సీఎంగా ఉంటే పేద విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహిస్తారు. చంద్రబాబు అమరావతి పేరుతో మాయా ప్రపంచం సృష్టించారు. జగన్ ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు. జగన్ ను ఎదుర్కోవడం లోకేష్ చేత కాదు. న్యాయం గెలిపించాలని భువనేశ్వరి అడగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు విషయంలో న్యాయం గెలుస్తుంది.. చట్టం కూడా గెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలు నమ్మ వద్దు’’ అని అన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘‘టీడీపీ పాలనలో సామాజిక సాధికారత నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు లా చూశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ఏపీలో ముస్లిం మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఓ చరిత్ర. మాకు ప్రజలతోనే పొత్తు’’ అని అన్నారు.
మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఎల్లో మీడియా వక్రీకరణ కథనాలు ఆపాలని అన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మంచిని చూడాలి. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత సాధ్యం. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యం అయింది. టీడీపీ హామీలు నమ్మొద్దు’’ అని అన్నారు.
మరో మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. ‘‘జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తున్నారు. అబద్ధపు హామీలతో మరోసారి మోసం చేసేందుకు టీడీపీ - జనసేన సిద్ధం అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 2 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం. పేదలకు అండగా జగన్ ప్రభుత్వం ఉంది. జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం’’ అని అన్నారు.