Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వస్తున్న వేళ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టత ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో జరిగిన వైఎస్ఆర్ సీపీ సభలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఏపీలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే, అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఏపీలో బలంగా ఉందని ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని అన్నారు. 


తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. ఆయన రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలని విలేకరులు ప్రశ్నించగా, జనసేన అధినేత గురించి తానేమీ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు.


‘‘మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆలోచన లేదు. మేం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఒకేసారి వెళ్తాము. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అందుకే ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నాడు. చంద్రబాబు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకసారి వామపక్షాలు, మరోసారి జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు. వైఎస్ఆర్ సీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీకి దిగుతుంది. పవన్ కళ్యాణ్ గురించి నేనేం మాట్లాడను’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.


ఎనీటైం బ్యాగ్ వెండింగ్ మిషన్‌ను ఆవిష్కరించిన మంత్రి


ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు. 


1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవంను నిర్వహిస్తున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తచేశారు. అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణానికి ముప్పు లేని జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని వివరించారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగాగ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో దేవాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్  దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు.