Leopard Spotted at Tirumala: తిరుమలలో చిరుతపులుల సంచారం కొనసాగుతూనే ఉంది. వాటిని పట్టుకొని బంధిస్తున్నప్పటికీ... ఒక్కొక్కటిగా సీసీ కెమెరాలకు చిక్కుతున్నాయి. అధికారులు కూడా వాటిని బంధించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల నడక మార్గం, మెట్ల మార్గంలో ఓ చిన్నారి చిరుత దాడికి గురై చనిపోయినప్పటి నుంచి టీటీడీ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను పసిగడుతోంది. ఇక శేషాచలం కొండల్లో చేపట్టిన ఆపరేషన్ చిరుత సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటి వరకు మొత్తం నాలుగు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. అయితే ఇంతటితో చిరుతల సంచారం ఆగిపోయినట్టేనని అంతా సంతోష పడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా మరో చిరుత ట్రాప్ కెమెరాల కంట పడింది.
నరసింహ స్వామి ఆలయం సమీపంలో చిరుత సంచారం
అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో మరో చిరుత సంచారాన్ని టీటీడీ అధికారులు గుర్తించారు. నరసింహ స్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. అలాగే నడక మార్గంలో ఈనెల 5వ తేదీ నుంచి ఊతకర్రలను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అలిపిరి దగ్గర కర్రలను ఇచ్చి.. నరసింహ స్వామి ఆలయం వద్ద వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
మరోవైపు సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. సెప్టెంబరు 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
రాత్రి ఏడు గంటల నుంచి గరుడ సేవ
అనంతరం ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియ జేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. గరుడ సేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తుల అదరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళతామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు.