Tirumala Tirupati Brahmotsavam 2025 Dates | తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో దళితవాడల్లో 1000 వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ తీర్మానం చేసింది. ఒక్కో ఆసెంబ్లీ నియోజకవర్గంలో 6 ఆలయాలు దాకా నిర్మించనున్నారు. మతమార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో గతంలో కంటే ఘనంగా నిర్వహించాలని చర్యలు చేపట్టారు.
తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు విసృతమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాలకు విసృత ఏర్పాట్లు, ముఖ్యమైన తేదీలు, కార్యక్రమాలుభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు చర్చించామన్నారు బిఆర్ నాయుడు. సెప్టెంబరు 23న అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. 24 తేదీ నుండి అక్టోబరు 2 వరకు జరుగనున్న వాహనాసేవలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అంగీకరించింది. బ్రహ్మోత్సవాల మొదటి రోజు (24) సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అలాగే, అదే రోజు రాత్రి "పెద్ద శేష వాహనం" సేవ కూడా జరుగనుంది. బ్రహ్మోత్సవాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 25వ తేదీన సీఎం చంద్రబాబు పీఏసి - 5 ను ప్రారంభిస్తారు. ఆయన చేతుల మీదుగా "వెంకట్రాది నిలయం" ప్రారంభోత్సవం కూడా జరుగనుంది.
ప్రముఖులకు బ్రేక్ దర్శనం, భద్రతా ఏర్పాట్లుబ్రహ్మోత్సవాల సందర్భంలో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. పది రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. గరుడ సేవ సందర్భంగా, 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడసేవ నాడు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. ఈ రోజు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
చిన్నారులకు జియో ట్యాగింగ్ఇంటర్నెట్, సాంకేతికతను ఉపయోగించి భక్తుల రక్షణా కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. తిరుపతిలో ఎల్.ఇ.డి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిన్న పిల్లలు, వృద్ధులకు "జియో ట్యాగ్" చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ అధికమయ్యే సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల చిత్రీకరణ కోసం ముంబయి నుండి ప్రత్యేక బృందం కూడా ఏర్పాటవుతోంది.
సిఫార్సు లేఖల రద్దు, కఠిన చర్యలుభక్తుల సౌకర్యం కోసం, 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ పై అసత్య ప్రచారం చేసిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా, 10 రోజుల పాటు శ్రీవారి మెట్లపై 24 గంటలు భక్తులను అనుమతించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.