Janasena leaders Arrest: విశాఖ ఏయిర్ పోర్టులో మంత్రి రోజా జబర్దస్త్ షో చేశారని, కావాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి వైసీపీ నేతలు వచ్చారని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, ఇతర వైసీపీ నతేలపై దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో నిన్న జరిగిన రాళ్ల దాడి, ఆపై అర్ధరాత్రి పోలీసులు పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ కు వెళ్లి జనసేన నేతల్ని అరెస్ట్ చేయడంపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా‌ సమావేశంలో జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేవన్నారు.


మూడు నెలల కిందటే పవన్ జనవాణి ఖరారు.. 
అధికార పార్టీ వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో ఉద్దేశపూర్వకంగా సభ పెట్టారని, కానీ విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందని తెలిపారు కిరణ్ రాయల్. ఎందుకు పనికిరాని రాష్ట్ర మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎయిర్ పోర్టులోకి పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి ఏపీ మంత్రులు అక్కడికి వచ్చారని, వైసీపీ ముందుగానే ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులో రోజా జబర్దస్త్ షో చేయడం ఆపి, ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలన్నారు. దమ్ముంటే పవన్ ని టచ్ చేసి చూడాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నేతల్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  
మంత్రి రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని కట్టుకోవాలంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. రోజాకి విశాఖలో ఏం జరిగిందో తెలుసు. పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడుతున్న పవన్ పై, జనసేన నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం, నోటీసులు ఇవ్వడం, అసత్య ఆరోపణలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎక్కువ చేస్తే మంత్రి రోజా బయట తిరగనీయకుండా చేస్తామన్నారు. 


కాబోయే సీఎంను అడ్డుకుంటున్నారు !
పవన్ ని చూస్తే వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసి పోతున్నాయని, అందుకే రాష్ట్ర మంత్రులు బాగా యాక్టింగ్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కి పవన్ అంటే భయం అని, ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు ఆదరణ పెరగడం చూసి ఏపీ సీఎం భయపడుతున్నారని చెప్పారు. పోలీసు వ్యవస్థ అడ్డుకున్నది కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అని, అది గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఒకవేళ ప్రజా సమస్యల పరిష్కారమే వైసీపీ నీతి అయితే, జనసేన ఆ పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మంత్రులకు వాళ్ళ శాఖపై అవగాహన లేదు, కానీ పవన్ పై విమర్శలు చేయడం, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించడం మాత్రం బాగా తెలుసునన్నారు. 
వైజాగ్ లో పవన్ కి ఉన్న ఆదరణ చూడలేక, కడుపు మంటను ఇలా పోలీసులతో అక్రమ అరెస్ట్ లు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ లా.. జగన్ ఏపీలో పరిపాలిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా మద్దతుతో అధికారంలోకి వస్తామని, అప్పుడు వారి పని పడతాం అన్నారు. గంజాయి, ఎర్ర చందనం, ఇసుక మాఫియా అన్ని బయటకు తీస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాలను గుర్తుచేసిందన్నారు.