Tirumala News: కట్టెదుర వైకుంఠము కాణాచయినకొండ!    తెట్టలాయ మహిమళే తిరుమల కొండ!! అంటూ అన్నమయ్య సంకీర్తనలు మనకు వినిపిస్తుంటాయి. సప్తగిరుల్లో వెలసిన శ్రీనివాసుని దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తుంటారు భక్తులు. కలియుగంలో శరణాగతవత్సలుడు, ఆపద్భాందవుడు, వడ్డికాసుల వాడా శ్రీనివాస.. గోవింద అంటూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిగా భక్తిప్రపత్తులతో పూజిస్తారు. 


తిరుమల క్షేత్రానికి అడుగడుగునా అనేక చరిత్రలు ఉన్నా వాటిలో కొన్నింటిని మాత్రమే మనకు తెలుసు.. వీటిలో మనం స్వామి వారి దర్శనం కోసం వెళ్లే క్రమంలో తొలి అడుగు వేసే మహాద్వారం వద్ద మనకు రెండు విగ్రహాలు దర్శనమిస్తాయి. వీటిని ఎప్పుడైనా గమనించారా...వాటి గురించి చాల తక్కువ మందికి తెలుసు. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి వేల కిలో మీటర్లు ప్రయాణించి.. స్వామి వారి దర్శనం చేసుకోవడం మీద మన ఆసక్తి ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా తిరుమల యాత్రలో మహాద్వారం వద్ద రెండు వైపుల ఉన్న విగ్రహాల గురించి తెలుసుకుని తప్పకుండా దర్శనం చేసుకోండి.


మహాద్వారం వద్ద రెండు విగ్రహాలు..


భక్తులు కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమల దివ్యక్షేత్రం నిత్యం కల్యాణం.. పచ్చ తోరణంలా విరాజిల్లుతోంది. ఈ చోట కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలుపు ఉండాలని అంటారు. ఆయన దర్శనభాగ్యం కోసం వెళ్లే క్రమంలో మహాద్వారం వద్ద మనకు రెండు వైపుల చిన్నపాటి విగ్రహాలు ఇరువైపులా దర్శనమిస్తాయి. మహాద్వారం రెండు వైపుల ద్వారపాలకులు లాగా సుమారు రెండు అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని శంఖనిధి - పద్మనిధి అని పిలుస్తారు. వీరి పేర్ల వినగానే మీకు అర్థం అవుతుందా. తిరుమల శ్రీనివాసుని సంపదలను, నవ నిధులను రక్షించే దేవతలుగా పురాణాల్లో లిఖించబడ్డాయి. 




ఆ విగ్రహాలు ఎవరివి..


ఇందులో దక్షిణ దిశలో (ఎడమ వైపు)న ఉన్నది రక్షక దేవతకు రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. ఈ దేవత పేరు శంఖనిధి. ⁠మరోవైపు అయిన ఉత్తర దిశలో (కుడి వైపు)న ఉన్న రక్షక దేవతకు రెండు పద్మాలు ధరించి ఉంటాయి. ఈ దేవత పేరు పద్మనిధి. ఈ రెండు విగ్రహాలు పాదాల వద్ద ఆరంగుళాల పరిణామం గల రాజ విగ్రహం నమస్కార భంగిమలో నిల్చిని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయల వారిది. బహుశా  ఆయన ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉంటారని కొందరు తమ కావ్యాల్లో రచించారు.



 


ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీనిని బట్టి తిరుమల ఆలయం 3 ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల స్పష్టమవుతుందని అంటారు. తిరుమల ఆలయంలో మొదటిది ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం, రెండోది విమాన ప్రదక్షిణం, మూడోది సంపంగి ప్రదక్షిణం. 


ఈసారి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పక మహాద్వారం వద్ద ఉన్న శంఖనిధి- పద్మనిధికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తే మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.