Hindalco iPhone Plant at Kuppam: అంతర్జాతీయ అల్యూమీనియం తయారీ సంస్థ Hindalco ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతోంది. హిందాల్కో ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పెట్టుబడిపెడుతోంది. రూ. 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాదు, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌ల ఛాసిస్ iPhone Alluminnium Chasis(బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు కానీ.. కుప్పంలో ప్లాంట్ ఏర్పాటు దాదాపు ఖరారు అయినట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది.
2027కు ప్లాంట్ సిద్ధం
కుప్పంలో ఉన్న పాత అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన Hindalco అక్కడ తన కార్యకలాపాలు మొదలుపెడుతుంది. ఏపీ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ర్రీ పాలసీ 2025-30 కు అనుగునంగా ఈ సంస్థ ఏర్పాటవుతోంది. 2026 చివరి నాటికి నిర్మాణం పూర్తవుతుందని.. 2027 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా షుమారు 600 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీకి కుప్పం సమీపంలో ఉంటుంది. ఈ అనుకూలతను ఉపయోగించుకుని కుప్పంలో Hindalco యూనిట్ ప్రారంభం అవుతోంది.
ఈ ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు. "మేక్ ఇన్ ఇండియా" మరియు "మేక్ ఫర్ ది వరల్డ్" అంటున్న భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది ఒక ముందడుగు. ఇంతకు ముందు ఐఫోన్ విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫోన్లలో ఉపయోగించే చాసిస్‌ను ఇక్కడే తయారు చేస్తుండటం ఐఫోన్ మేకింగ్ ఇన్ ఇండియా డ్రీమ్‌లో కీలకమైన అంశం.
ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో, అల్యూమినియం మరియు రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు ఈ సంస్థ కీలకమైన ఉత్పత్తులను అందిస్తుంది.
యాపిల్ ఫోన్ల తయారీలో కీలక అడుగు
యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్ Foxconnను ఏపీకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ కంపెనీ భారత్‌లో విస్తరణకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శ్రీ సిటీలో ఫాక్స్‌కాన్‌ను అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. అప్పట్లో ఇక్కడ Iphone టెస్టింగ్, అసెంబ్లింగ్ చేశారు. ఇంకా శ్రీపెరంబదూర్, బెంగళూరులో కూడా ఫాక్స్‌కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటీవలనే యూపీలో యూనిట్ ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే వియత్నాం తరహాలో పెద్ద ఎత్తున మాన్యుఫాక్చరింగ్ చేసేందుకు ఫాక్స్‌కాన్ సిటీని నిర్మించాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే కుప్పంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. హిందాల్కో అక్కడ అడుగుపెడితే.. మరిన్ని పరిశ్రమలు అక్కడకు రావడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యనే నెల్లూరు- బెంగళూరు హైవే నుంచి కుప్పంకు నాలుగు వరుసల రహదారి నిర్మించారు. బెంగళూరుకు అతి దగ్గరగా ఉండటంతో దీనిని పారిశ్రామిక కేంద్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.